Friday, January 10, 2025

మూడు నెలల్లో పాలమూరు జలాలు..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ ః ఇక మీదట సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరగకుండా అడ్డుకుంటే అక్కడే కాలవల్లో వేసి తొక్కేస్తాము, వెంటాడి తరిమికొడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కర్వేన రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ముందుగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని గులాబి పూలతో ప్రాజెక్టులో వదిలి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించేలా కృషి చేసిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సిఎం కెసిఆర్ పడిన శ్రమ ఎంతో గొప్పదని కొనియాడారు. ఆర్‌డిఎస్ షట్టర్లు బద్దలు కొట్టి మన తెలంగాణ నీటిని ఆంధ్రకు తరలించుకుపోయినా అనాటి ముఖ్యమంత్రులు ఏనాడు స్పందించిన పాపాన పోలేదన్నారు. పాలమూరు గోసను చూసిన ఉద్యమ నేత కెసిఆర్ జోగులాంబ నుంచి ఆర్‌డిఎస్ వరకు పాదయాత్ర చేశాడని తెలిపారు. పాలమూరు వలస కూలీల కన్నీళ్లు చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు 100 టిఎంసిల కెపాసిటితో ప్రాతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే పాలమూరు వలసలు ఉండాలని భావించే ప్రతిపక్ష పార్టీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు జరగకుండా అనేక కుట్రలు చేశాయని దుయ్యబట్టారు. కోర్టుల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులే కేసులు వేసి ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కొర్రీలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గతంలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదాలో లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కర్నాటకలోని అప్పర్ బద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేసిందని విమర్శించారు. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటిని అందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు పండుగ చేసుకుంటారని హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సిఎం కెసిఆర్ ఆద్వర్యంలో రెండు మూడు నెలల్లో రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యేలు వెల్లడించారు.

ఇక మీదట ఎవరైనా రైతులకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టు పనులు అడ్డుకుంటే అక్కడే కాలువల్లో వేసి తొక్కేస్తామని హెచ్చిరించారు. పాలమూరు ప్రజల బతుకు దెరువే సాగునీరని అలాంటి సాగునీరు రాకుండా అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి ఎతిపోతల పథకానికి నీటి నిల్వ సామర్ధం లేకుండా రిజర్వాయర్లు నిర్మించకుండా అన్యాయం చేసిన ఘనత గత పాలకులదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును కల్వకుర్తి ప్రాజెక్టుకు అను సంధానిస్తామని , భవిష్యత్‌లో కాలేశ్వరం జలాలను కూడా పాలమూరుకు తరలిస్తామని కెసిఆర్ చెప్పారని తెలిపారు. ప్రాజెక్టులను ఆపాలని ఎవరైనా కుట్రలు చేస్తే ఈ ప్రాంతం వాడైతే ఇక్కడే పాతర వేస్తామని, పరాయి వాడైతే తరిమి కొడతామని హెచ్చిరించారు.

పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుంకులు తొలగించిన సిఎం కెసిఆర్‌కు యావత్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున పాదాభివందనాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ్రగ్రంథాయల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఎంపిపి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News