అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: జాతీయ రహదారుల వలయంగా మహబూబ్ నగర్ జిల్లా మారబోతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో చించోలి నుంచి మహబూబ్‌నగర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణ పనులపై ఆయన అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ టు బెంగళూరు, బళ్లారి టు కోదాడ జాతీయ రహదారులు ఉండగా చించోలి- టు మహబూబ్ నగర్ జాతీయ రహదారి కూడా కొత్తగా ఏర్పాటు అవుతుందని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి అమ్రాబాద్ వరకు కూడా మరో జాతీయ రహదారి ఏర్పాటు కానుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల కనెక్టివిటీ పెరగడంతో పాటు కొత్త హైవేలతో మరింత రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, జాతీయ రహదారుల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్‌లు పాల్గొన్నారు.