Saturday, December 21, 2024

నూతన క్రీడా విధానం పై ‘శాట్స్’అధికారులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ రూపొందించిన నూతన క్రీడా విధానం ముసాయిదాపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని హరితప్లాజా హోటల్‌లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో క్రీడా శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, మాజీ మంత్రి , రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షడు సముద్రాల వేణు గోపాలా చారి, క్రీడా శాఖ డైరెక్టర్ డా. కె. లక్ష్మి, కార్యదర్శి జగదీష్ యాదవ్, శాట్స్ అధికారులు పాల్గొన్నారు. నూతన క్రీడా విధానం పై ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా ముసాయిదాకు తుది రూపం ఇచ్చి, వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికీ ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒలంపిక్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వివిధ దేశాల క్రీడా విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మెరుగైన అంశాలను క్రోడీకరించి, క్యాబినెట్ సబ్ కమిటికి అందజేయాలని ఆదేశించారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందో అధ్యయనం చేసి స్పోర్ట్ పాలసీలో జోడించాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అదేశించారు. ఈ సమీక్షలో తెలంగాణ నూతన రాష్ట్ర క్రీడా విధానము జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగ నిష్ణాతుల మెప్పు పొందేలా మన రాష్ట్ర క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఉండాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ అభిమతమన్నారు. అందుకు తగిన విధంగా తుది కసరత్తు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పాలసీ తయారీలో క్రీడ రంగ మేధావులు, అసోసియేన్ ప్రతినిధులు, ఒలంపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు, ఎంతోమందితో సంప్రదించి వారి సలహాలు సూచనలు అన్నిటినీ సమీకరించి ఒక మంచి ముసాయిదాను తయారు చేస్తామని..

ఇంకా ఇందులో జోడించాల్సిన అంశాలపై వెంటనే దృష్టి సారించి దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రక్రీడారంగ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి పాలసీని తీసుకొచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, క్రీడా సామాగ్రి వివరాలను క్రీడా పాలసీ నందు పొందుపరిచి సంబంధిత గ్రామీణ క్రీడా ప్రాంగణాలను, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాట్స్ ఆధ్వర్యంలో ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తెలంగాణ క్రీడా పాలిసీ నందు గ్రామీణ క్రీడాకారులకు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్వహిస్తున్న సిఎం కప్ టోర్నమెంట్ వివరాలను అన్ని జిల్లాల యందు విడతల వారీగా క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయు విదంగా పాలసీలో పొందుపరచాలని తెలిపారు. జిల్లా స్థాయి నందు క్రీడా అకాడమీలు, హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ విలేజ్ ప్రాంగణాలను, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్వహించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలనీ క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా క్రీడా పాలసీ నందు విద్యా పంచాయత్‌రాజ్ శాఖ సహకారంతో గ్రామీణ స్థాయి నుంచి క్రీడా అభివృద్ధి జరుగుటకు సంబంధిత పిఈటిల భాగస్వామ్యం చేయు విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పోర్ట్ కోటాను సంబంధిత అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రవేశముల యందు ప్రభుత్వ, అన్ని సంస్థల ఉద్యోగాలలో అమలు చేయు విధంగా అందుకు శాట్స్ నుండి ఒక అధికారిని ప్రతేక్యంగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్ని స్టేడియాలు అత్యున్నత స్థాయి నిర్వహణకు సిఎస్‌ఆర్, పిపిపి నిధులను ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం ,క్రీడా సంఘాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా శాఖా సమన్వయంతో స్పోర్ట్ క్యాలెండరును విడుదల చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుండి అనుమతి తీసుకొని ప్రవేట్ సెక్టార్‌లో జిమ్‌లు,

స్పోర్ట్ అకాడమీలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రైవేట్ సెక్టార్‌లో స్పోర్ట్ అకాడమీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కోచ్‌లను మూడు కేటగిరీలలో నియామకానికి తగిన నియమాలను పొందుపరచాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం జిల్ల స్థాయిలో 15 రోజులు క్రీడలను నిర్వహించే విధంగా చూడాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు కోచ్ లను రెగ్యూలరైజ్ చేయాలనీ , జిల్లాలలో వివిధ స్టేడియాలలో పనిచేయడానికి కోచ్‌లను నియమించుకోవాలని శాట్స్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News