మహబూబ్‌నగర్: కుల, మతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి 154 జయంతి వేడుకల సందర్భంగా మహబూబ్‌నగర్, పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. వెంకట్రామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తని, ఆయన అందరివాడన్నారు మంత్రి. హైదరాబాదులో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి అనేకమంది రైతు కుటుంబాల, పేద విద్యార్థులకు విద్య అందించేందుకు కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే మిగతా వాళ్ళు కూడా వసతి గృహాలు, భవన్లు ఏర్పాటు చేశారని తెలిపారు.
అంబేద్కర్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పూలే, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులు సమ సమాజం కోసం పాటు పడ్డారన్నారు. వారి ఆశయాలు, భావజాలంతో పేదల కోసం సహాయపడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజం కోసం పాటుపడిన మహనీయులను కొన్ని కులాలు, మతాలకే పరిమితం చేయాలని చూడడం బాధాకరమని ఈ సందర్భంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల జయంతి వర్ధంతి వేడుకల్లో కొన్ని కులాలు, మతాలకు సంబంధించిన వ్యక్తులే కాకుండా అందరూ వచ్చి నివాళులు అర్పించాలని మంత్రి కోరారు. జిల్లాకు చెందిన పోరాటయోధుడు సురవరం ప్రతాపరెడ్డి కుటుంబాన్ని స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కౌన్సిలర్లు కట్టా రవి కిషన్ రెడ్డి, అనంత రెడ్డి, రెడ్డి సేవా సమితి నాయకులు ఇంద్రసేనారెడ్డి, పొద్దుటూరి ఎల్లారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.