మహబూబ్ నగర్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మన్యంకొండ దేవాలయం ఉందని, మునుల కొండగా, రెండవ తిరుపతిగా, ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేలా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, రూ.10కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. నూతన పాలకమండలి మన్యంకొండ దేవాలయం అభివృద్ధికి సేవ చేయడం అదృష్టంగా భావించాలని, స్వామివారి కార్యంగా భావించి మన్యంకొండ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొండపై నిర్మిస్తున్న 18 గదులు 4 నెలల్లో పూర్తి చేయాలని, నూతన పాలక మండలి సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఒక్కరు ఒక గది నిర్మాణాన్ని బాధ్యత తీసుకోవాలని, గదులను స్టార్ హోటల్ లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అలివేలు మంగ దేవాలయం వద్ద నిర్మిస్తున్న ఏసీ ఫంక్షన్ హాల్ ను కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే కొండపై మరో వంద గదులు, క్యూ కాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణ మండపం, కోనేరు సుందరీకరణ వంటి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఎవరైనా పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు వస్తే ఉచితంగా పెళ్లిళ్లు, వారికి భోజనం అందించే ఏర్పాటు చేయాలని, ఇందుకు దాతలు ముందుకు రావలసిందిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
Minister Srinivas Goud visit Manyamkonda Temple