హైదరాబాద్: ఆబ్కారీ శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. పబ్ యజమానులు మంత్రితో సమావేశమయ్యారు. పబ్ లలో డ్రగ్స్, ఇతర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. నిబంధనలపై పబ్ ల యజమానులతో మంత్రి చర్చించారు. పుడింగ్ పబ్ లో కొకైన్ దొరికిన నేపథ్యంలో ఆబ్కారీ మంత్రి ప్రత్యేక సమీక్షించారు. సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తొలిదశలో పేకాట క్లబ్ లను మూసివేయించారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ నిరోధించడమే సిఎం లక్ష్యమన్నారు. డ్రగ్స్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని సిఎం ఆదేశించారు. అందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలకు ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే పిడి చట్టం ప్రమోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తేనే పబ్ లకు అనుమతిస్తామన్నారు. నగరానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే పబ్ లు మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి పబ్ లో అన్ని వైపులా సిసి కెమెరాలు ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పబ్ లు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆబ్కారీ అధికారులదేే బాధ్యతన్నారు. పబ్ లు, బార్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలుంటాయి. నగరంలోని 61 పబ్ లపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంత్రి చెప్పారు.