Monday, December 23, 2024

ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud's review with senior officials

హైదరాబాద్: దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు పండించిన వరి ధాన్యంను సద్వినియోగం చేసుకుని వరితో ఇథినాల్ ఉత్పత్తిపై ఎక్సైజ్, సివిల్ సప్లయర్స్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, అనుబంధంగా ఎన్నో రిజర్వాయర్లును నిర్మించడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై ఎఫ్ సిఐ, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా వరి ధాన్యంను ఇథినాల్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చని సిఎం కెసిఆర్ ఇచ్చిన అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉత్పత్తి చేసిన వరిని గరిష్టంగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా కొత్తగా ఇథినాల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇథినాల్ ఈ పరిశ్రమల వల్ల రైతులకు మేలు చేకూరేలా, ఇథినాల్ ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించటానికి, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి రాష్ట్రంలో కొత్త ఇథినాల్ పరిశ్రమల స్థాపనపై ముఖ్యమంత్రితో సవివరంగా చర్చించి నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇథినాల్ పరిశ్రమల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూనిట్ల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వల్ల 4 కోట్ల లీటర్ల ఇథినాల్ ఉత్పత్తి అవుతుందని, రాష్ట్రానికి 74 కోట్ల లీటర్ల ఇథినాల్ అవసరం ఉందని, 74 కోట్ల లీటర్ల ఇథినాల్ ఉత్పత్తి కోసం 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అవసరమని, ఇందులో 20 శాతం ఇథినాల్ పెట్రోల్ లో కలపడానికి ఉపయోగపడుతుందని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 8 స్పిరిట్/ఇథినాల్ ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలను స్థాపించటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ హమ్మద్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News