Friday, November 22, 2024

సింధుకు నీరాజనం..

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Gowd felicitated medalist Sindhu

పతక విజేతకు ఘన స్వాగతం

మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ఆణిముత్యం, తెలుగుతేజం పి.వి.సింధుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అపూర్వ స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, ఎయిర్‌పోర్ట్ సిఇఓ ప్రదీప్ ఫణికర్ తదితరులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సింధు అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పతక విజేత సింధును ఘనంగా సత్కరించారు. వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి సింధు రాష్ట్రంతో పాటు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని చిరస్మరణీయ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సింధును స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారని పేర్కొన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం గెలుస్తుందనే నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

గర్వంగా భావిస్తున్నా..

మరోవైపు సింధు మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపింది. వచ్చే పారిస్ క్రీడల్లో స్వర్ణం గెలవాలని లక్షంగా పెట్టుకున్నట్టు వివరించింది. తన విజయంలో కోచ్ పార్క్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది. ఏడాది పాటు తన ఆటను మెరుగు పరిచేందుకు పార్క్ ఎంతో కృషి చేశారని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది.

కొవిడ్ పరిస్థితుల్లోనూ పార్క్ తన సొంత దేశం కొరియాకు వెళ్లకుండా, కుటుంబానికి దూరంగా ఉంటూ తనకు శిక్షణ ఇచ్చారని, తాను పతకం సాధించడంలో ఆయనదే ముఖ్య పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. ఇక తాను ఈ స్థాయికి చేరుకున్నానంటే తన తల్లతండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపింది. వారిద్దరూ క్రీడాకారులు కావడం తనకు కలిసి వచ్చిందని వివరించింది. కోచ్ పార్క్ మాట్లాడుతూ సింధులో అపార ప్రతిభ దాగివుందని, వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు. తన శిష్యురాలి ఘనతను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News