హైదరాబాద్: పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బహదూర్ పల్లిలో సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని ఇండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పేదలపై ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తున్నాం.
దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదు. గత ప్రభుత్వాలు నామమాత్రపు సహాయం అందజేసి ఇరుకైన ఇండ్లను నిర్మించింది. మొదటి విడతలో రానివారు ఆందోళన చెందవద్దు…. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తాం. మొదటి విడతలో 11,700 మందికి ఇండ్ల పంపిణీ చేస్తున్నాం. జిహెచ్ఎంసి పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. దశల వారిగా ఇండ్ల పంపిణీ జరుగుతుంది. కొందరు దుర్మార్గులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. వారి మాటలు నమ్మొద్దు అని పేర్కొన్నారు.