హైదరాబాద్: తెలంగాణ గుండెకాయ, రాష్ట్ర రాజదాని కేంద్రమైన హైదరాబాద్ మహానగరం గడిచిన 8 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద రూ. 5 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజేస్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాపిక్ సమస్యను పరిష్కరించడం కోసం నూతనంగా ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం తో పాటు రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పాదచారులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు నగర వ్యాప్తంగా పెద ఎత్తున పుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇప్పటి వరకు 7 పుట్ ఓవర్ బ్రిడ్జిలను ప్రజలకు అందుబాటులోకి రాగా, మరో 22 బ్రిడ్జిల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. పూర్తి అత్యాధునికంగా నిర్మించినఈ పుట్ ఓవర్ బ్రిడ్జి కు రెండు వైపులా లిఫ్ట్ లు, ఎస్కలేటర్ లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భద్రతపరమైన చర్యల్లో భాగంగా 8 సిసి కెమెరాలను కూడా అమర్చారు. వృద్దులు, చిన్నారులు సైతం ఎంతో సులువుగా ఎక్కి రోడ్డును దాటే విధంగా పుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు దీపిక, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్‌ఈ అనిల్ రాజ్,డిసి ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.