Monday, December 23, 2024

కల్యాణం.. కమనీయంగా నిర్వహిద్దాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani inspected balkampet yellamma temple

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా.. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం (5వ తేదీ) జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, 6వ తేదీన జరిగే రథోత్సవం ఏర్పాట్లను ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దర్శనం సాఫీగా సాగేలా పటిష్టమైన భారీ కేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అమ్మవారి కల్యాణాన్ని తిలకించేలా ఎల్‌ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయడంతో పాటు లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సిసి కెమెరాల ఏర్పాటు,. షీ టీమ్స్, మఫ్టీ పోలీసు బృందాలతో పాటు భారీ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. అన్నదానం నిర్వహించే ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ కోసం జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో వ్యర్థాలు వేసేందుకు ప్రత్యేక కవర్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. కల్యాణం నిర్వహించే అమ్మవారి నూతన విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో కుంభకోణం నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, మహా పుణ్యక్షేత్రంను తలపించే విధంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

అమ్మవారి కల్యాణాన్ని ఆలయం ముందు నిర్మించిన భారీ రేకుల షెడ్డు కింద నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారంతో కోటి రూపాయల విలువ కలిగిన బంగారు చీర, ఆభరణాలు చేయించి అమ్మవారికి అలంకరిస్తున్నట్లు తెలిపారు. నిత్యం అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఒ అన్నపూర్ణ, ఆలయ ధర్మకర్త సాయిబాబాగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్,సిఐ సైదులు, జలమండలి జిఎం హరిశంకర్, రాధాకృష్ణ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News