Tuesday, November 5, 2024

గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదని తలసాని అన్నారు.

రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును గవర్నర్ రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సమంజసంగా లేదన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర పోలీసు డిజిపి అంజనీ కుమార్‌తో పాటు పలువురు అధికారులు రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారని తలసాని పేర్కొన్నారు.

అయినప్పటకీ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై
లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదన్నారు. గణతంత్ర వేడుకలపై ప్రభుత్వానికి నిబంధనలు తెలుసన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అక్కసుతోనే గవర్నర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలుగా మాట్లాడటం సరికాదన్నారు.

తమిళిసై మాదిరిగా అందరు గవర్నర్లు ఇలాగే వ్యవహరిస్తే….ఇక రాజ్యాంగానికి, రాజకీయాలకు మధ్య పెద్దగా తేడా ఉండదన్నారు. అందువల్ల ఇప్పటికైనా ఆమె హుందాగా వ్యవహరించుకుంటే మంచిదని తలసాని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News