Sunday, December 22, 2024

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani review on various development works

హైదరాబాద్: ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి గ్రేటర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిహెచ్‌ఎంసి, రెవెన్యూ,హెచ్‌ఎండిఎ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా ఉండాలి అన్నదే సిఎం కె.చంద్రశేఖర్ రావు ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన స్థలాలలో ఎళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆ స్థలాలను కేటాయించాలని నిర్ణయించిందన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని దేవాదాయ శాఖకు చెందిన జీరా, సోమప్ప మఠం స్థలాల్లో ఉంటున్న నిరుపేదలు ఆ స్థలంలో తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని,ఈ స్థలాన్ని జిహెచ్‌ఎంసి కి బదిలీ చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సబంధింత శాఖ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా శ్యామలకుంటలో నివసిస్తున్న 330 గుడిసెవాసులు జిఓ 58 క్రింద 2014లో క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు డబుల్ ఇళ్లు కోరుతున్న నేపథ్యంలో అయితే కోర్టు కేసులు ఉన్నందున సమస్య పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ జీరా కాలనీ లో 134 ఇళ్లకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న కేసు 2002 లో లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు వచ్చిన్నందున జిఓ 816 గడువు ను పొడిగించడం ద్వారా వారికి న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా చరిత్రకు సజీవ సాక్ష్యాలైన పురాతన కట్టడాలను పరిరక్షణలో భాగంగా హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో చేపట్టిన బన్సీలాల్ పేట లోని నిజాం కాలంనాటి మెట్లబావి పునరుద్దరణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, వ్యూ పాయింట్ స్కై వాక్, కెఫేటేరియా, బెంచీలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పనుల పురోగతిని వచ్చేవారంలో అధికారులతో కలిసి మెట్లబావి ప్రాంతాన్ని పరిశీలించాలని సమావేశంలో మంత్రి నిర్ణయించారు. ఎంజి రోడ్ లోని గాంధీ పార్క్ సుందరీకరణ, నూతన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు కు సంబంధించిన పనులను మంత్రి సమిక్షించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి అదనంగా 16 ఫీట్ల నూతన మహాత్మాగాంధీ విగ్రహం తయారీకి అర్డర్ ఇచ్చామని అధికారులు తెలిపారు. పార్క్ విస్తరణ కోసం స్థల సేకరణ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు, స్తంభాల తొలగింపు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల తొలగింపు పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువు ఆగస్టు 15 వ తేదీ నాటికి పనులన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, దేవాదాయ శాఖ ఆర్‌జెసి రామకృష్ణ, సికింద్రాబాద్ ఆర్‌డిఓ వసంత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News