Monday, December 23, 2024

చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి

- Advertisement -
- Advertisement -

Minister Talasani Srinivas reviews fisheries development

మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని

హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నాంపల్లిలోని హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో మత్స్య శాఖ అధికారుల ఒకరోజు వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ చేప పిల్లలను పక్క రాష్ట్రం నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని, కానీ రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు సరైన ఆదరణ, నిధుల కేటాయింపు ఉండేది కాదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మత్స్య రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిధిలో గల 23 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం 1.30 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. 2019-20 సంవత్సరంలో ఈ కేంద్రాల ద్వారా 2.5 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేయగా, 2020-21 సంవత్సరంలో 5 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసినట్లు వివరించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఇప్పటి నుండే ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రైవేట్ వ్యక్తులు కానీ, సంస్థలు కానీ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొస్తే ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి నూతన ప్రాజెక్ట్ ల నిర్మాణం, మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్దరణ వంటి కార్యక్రమాలతో నీటి వనరులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరిగి ,మత్స్యకారుల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని చెప్పారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి మత్స్యకారుడికి అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అందుకోసం అర్హులైన మత్స్యకారులను మత్స్య సొసైటీ లలో సభ్యులుగా చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కారుడికి మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, జాయింట్ డైరెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మినారాయణ, మురళికృష్ణ, వివిధ జిల్లాల మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News