రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బీఆర్‌ఎస్ చేయనివి, చేసినట్టు తమప్రభుత్వం ఏమి చేయనట్లు పదేపదే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. -రైతు బంధు పేరుతో రైతాంగాన్ని దగా చేసిన బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న దొంగదీక్షలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులపై ఈ రోజు బీఆర్‌ఎస్ నాయకులకు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. ప్రతి పంట కాలంలో రైతుబంధు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పటి వరకు ఇచ్చారో గుర్తుచేసుకోవాలని సూచించారు.
రైతుబంధు పేరు చెప్పి పంటల భీమా, వ్యవసాయ యాంత్రికరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది బీఆర్‌ఎస్ నాయకులు కాదా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసంతో కుదేలైన ఆర్థిక పరిస్థితులను తాము క్రమంగా చక్కబెట్టుకుంటు రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటు, ఒక్కొక్క పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి తుమ్మలు వెల్లడించారు. గ్రామీణ ప్రజలు రెండు పర్యాయలు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ని తిరస్కరించారని, ఇప్పటికైనా బిఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి తుమ్మల హితవు పలికారు.