పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు
ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా
నా అభివృద్ధి ఆనవాళ్ళుంటాయి
ఎంపి అర్వింద్ కుమార్‌కు మంత్రి
తుమ్మల బహిరంగ లేఖ
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్ర భుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసిన సం దర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్రతజ్ణతలు తెలిపిన విషయంపై నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం బహిరంగ లేఖను విడుదల చేసి తీ వ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరవింద్ చేసి న వ్యాఖ్యలను ఆయన విచక్షణకు వదిలివేస్తున్నానని ఆ లేఖలో పేర్కొంటూ అభినందనలు తెలపడం కూడా తప్పేనా? అని ఆయన ప్ర శ్నించారు. మంత్రి తుమ్మల విడుదల చేసిన బహిరంగ లేఖలోని అంశాలు యధావిధిగా ఈ కింది విధంగా ఉన్నాయి.
“ నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగానే కాక, ఒక రైతుగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన అంశం ఇది. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాను. ఈ సందర్భంగా నా రాజకీయ జీవితం గు రించి మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం… ఆక్షేపణీయం. ఈ స్థాయికి దిగజారి మీరు మాట్లాడతారని నేను ఊహించలేదు. నా రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ మీ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
1983 నుండి ఈ నాటి వరకు నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏనాడు, ఏ నాయకుడి వద్ద నేను మోకరిల్లింది లేదు… ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నది లేదు. 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే తప్ప వ్యక్తిగత స్వార్థం లేదు… ఇకపై ఉండబోదు కూడా! ఆ నాడు నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడి నుండి నేడు రేవంత్ రెడ్డి వరకు ఏ కేబినెట్‌లో పని చేసినా, ఏ హోదాలో విధులు నిర్వర్తించినా రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం, పేదల పక్షపాతం తప్ప నాకు మరో ఎజెండా లేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు… చంద్రశేఖర్ రావు కావచ్చు…రాజకీయంగా, సిద్ధాంత పరంగా నాతో విభేదించవచ్చు కానీ… ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల నా కమిట్ మెంట్‌ను ప్రశ్నించలేదు. నాయకుడు ఎవరైనా, పార్టీ ఏదైనా ప్రజాహితమే నా అభిమతంగా పని చేశాను. నన్ను పార్టీలో చేర్చుకోండి, నాకు టికెట్ ఇవ్వండి, నాకు పదవి ఇవ్వండని ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఏనాడు, ఎవరిని అడిగింది లేదు. నా వల్ల సమాజానికి మంచి జరగుతుంది.
నా పని తీరుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి, విశ్వసించి ఆయా పార్టీలు, నాయకులు నన్ను కోరుకున్నారు, ప్రజలు ఆదరించారు తప్ప… నేను ఏ పార్టీ గుమ్మం ముందు, ఏ నాయకుడు వద్ద సాగిలపడింది లేదు.ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణ రాష్ట్రంలోనైనా ఏ మూలకు వెళ్లినా అక్కడ అభివృద్ధి ఆనవాళ్లలో నా గుర్తులు కనిపిస్తాయి. సాగునీటి ప్రాజెక్టులైనా, జాతీయ రహదారులైనా వాటి నిర్మాణంలో నా పాత్ర, నా శ్రమ ఉంటుంది. శిలా ఫలకాలపై నా పేరు కనిపిస్తుంది. మీరు పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లాలోనే కౌలాస్ నాలా, సింగీతం కల్యాణి, లక్ష్మీ కెనాల్, శారదా సాగర్, లక్ష్మీ సాగర్, ఇందల్వాయి, గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన నుండి పూర్తి చేయడం వరకు ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే.
ఆ సమయంలో మీ నాన్న ఉన్నారు, మీరు ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నారో కూడా నాకు తెలియదు. స్వర్గీయ -పీవీ నర్సింహారావు హయాంలో వరద కాల్వ మంజూరు చేయించడంలో నా పాత్ర గురించి మీ జిల్లా ప్రజలను, నాయకులను అడిగి తెలుసుకుంటే మంచిది.ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణమైన, నిర్మాణంలో ఉన్న ఏ జాతీయ రహదారి తీసుకున్నా వాటి మంజూరులో, నిర్మాణంలో నా ప్రయత్నం, ప్రమేయం ఉంది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుండి కేంద్ర మంత్రులుగా పని చేసిన, చేస్తున్న నితిన్ గడ్కరిని, కిషన్ రెడ్డి ని అడిగితే నా పాత్ర, ప్రమేయం గురించి వారే చెబుతారు.నా రాజకీయ జీవితం, నా వ్యక్తిత్వం గురించి మీ పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్‌రావుని, లక్ష్మణ్ ని, బండారు దత్తాత్రేయని అడిగి తెలుసుకోండి. ముఖ్యమంత్రులు ఎవరైనా, వారి సహకారం తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశాను. జైకా నిధులతో ఒ ఆర్ ఆర్ ప్రారంభించడం వెనుక నా పాత్ర ఉంది.
రాష్ట్రంలో నిర్మించిన అన్ని రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు (కాళేశ్వరం మినహా) నా ప్రమేయం లేకుండా జరిగింది లేదు. మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు. తాజాగా నేను వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో జాతీయ పసుపు బోర్డు సాధించుకోవడం నా బాధ్యతగా భావించి కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చాను. పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపాను. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏమిటి? మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం? బోర్డు ప్రకటన, ఏర్పాటు విషయంలో మీరు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించలేదు.అయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేం సంయమనం పాటించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున బోర్డు ఏర్పాటు విషయంలో తగినంత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఇదివరకే తెలియజేశాం.
ఇక బోధన్ చక్కెర కర్మాగారం గురించి మీరు ప్రస్తావించారు. అది రాష్ట్ర పరిశ్రమల శాఖ పరిధిలోని అంశం. ఐనా మంత్రివర్గ సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేస్తాను. సంబంధిత మంత్రితో మాట్లాడి, ఏం చేయాలి, ఎలా చేయాలో అది చేస్తాం. ఈ నేపథ్యంలో… స్థాయి దిగజార్చుకుని మీరు మాట్లాడిన మాటలు సరైనవి కావుఅని నేను భావిస్తున్నాను. రెండు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన మీరు ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదు. పరిపక్వతలేని మాటలు మాట్లడకుండా రాజకీయ పరిజ్ఙానంతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ… వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.“ అని తుమ్మల విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.