రైతు భరోసా కు సంబంధించి పెట్టుబడి సహాయం సాగులో ఉన్న భూమికి మాత్రమే అందించడం తమ ముఖ్యఉద్దేశ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా పథకాన్ని ఈ సంక్రాంతి నుంచి ఆరంభించే క్రమంలో భాగంగా శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రీమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయగల వివిధ కంపెనీ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సాగు చేసిన భూములను వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతు వారి నమోదు చేయడం జరుగుతుందని, దానితో పాటు పథకం అమలులో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల వారీ సర్వే నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం, సాగును అనువు గాని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందీ వంటి వివరాలను రైతుభరోసా పథకం అమలుతో పాటు, భవిష్యత్తులో చేపట్టనున్న పంటల భీమా అమలుకు,
అలాగే పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభములోనే గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్థంగా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భముగా ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధుల వారు ఆ దిశగా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్ట్ వివరాలతో పాటు, శాంపిల్ గా వారు చేసిన రెండు మండలాల వివరాలను పంటల వారీగా గ్రామాల వారీగా ఈ రోజు వరకు సాగైన వివరాలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి సమక్షంలో ప్రదర్శించారు. సాగుకు అనువు గాని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలలో తలెత్తే చీడపీడలను ఆరంభంలో గుర్తించేలా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్ ను వివరించారు. అనంతరం మంత్రి వారిని పూర్తి వివరాలలో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు క్యాబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు పాటు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.