మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి సంబంధించి ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తాం. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో చివరి విడత రుణమాఫీ ప్రక్రియను ప్రకటించారు. ఇప్పటివరకూ రెండు విడతల్లో రుణమాఫీకి సంబంధించిన వాటిలో సాంకేతికంగా ఇబ్బందుల వల్ల 30 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వెల్లడించారు. పొరపాట్లు అన్నీ సరి చేసి అర్హులు అందరికీ రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తోందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కొంతమంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని ,అడే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని ఆ రైతులకు రుణామాఫీ చేస్తే బాగుంటుందన్నారు. రైతు రుణమాఫీలో ఏది బాగాలేకపోయినా అందుకు గత ప్రభుత్వమే కారణం అన్నారు.తమ ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం రుణమాఫీకి చేస్తోందన్నారు.కోడిగుడ్డుపై ఈకెలు పీకే ప్రయ్నాలు మానుకోవాలని , లేని పోని విమర్శలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయటం ప్రతిపక్ష పార్టీలకు తగదని సూచించారు.గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులను రుణాల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాస్‌బుక్ లేకపోయినా, తెల్లకార్డు ద్వారా రుణాలు మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. మాఫీ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాంకేతిక కారణాల వల్ల కొన్ని రుణాలు మాఫీ కాలేదని,
వాటిని పరిష్కరించి రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.గత ఐదు సంవత్సరాలుగా తీసుకున్న రైతు రుణాలకు సంబంధించి ఖాతాల వివరాలు 32 బ్యాంక్‌లు పంపించాయని, ఇప్పటివరకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ వర్తింపజేశామన్నారు. తాము చెప్పినట్లుగా పూర్తిగా రైతు మాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. బ్యాంక్ తప్పిదాలు, ఆధార్ ఖాతాలో తప్పులు, సాంకేతిక సమస్యల వల్ల కొందరి ఖాతాలో డబ్బులు పడలేదన్నారు. అలాంటి వారికి సైతం రుణమాఫీని వర్తించేలా చర్యలు చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు భరోసా ఇచ్చారు.
రాష్ట్రాన్ని కరుణించిన వరుణుడు:
ఈ సారి వరుణుడు కరుణించాడని ,కృష్ణాబేసిన్‌లో చాలా రోజుల అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని మంత్రి హర్హం వ్యక్తం చేశారు. గోదావరి బేసిన్‌లో కొంత లోటు వుందున్నారు. ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరన శాఖ చెబుతున్నట్టు తెలిపారు. అన్ని పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. రైతులకు అన్ని రకాల విత్తనాలకు లోటు లేకుండా సరఫరా చేశామన్నారు. కేంద్రం కొంత అనాసక్తిగా ఉన్నా ఎరువులకు ఇబ్బంది లేదన్నారు. పంటల బీమా ఈ ఏడాది అమలు చేస్తామని, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని మంత్రి వివరించారు. సాగులో లేని భూములకు పొందిన రైతుబంధు రికవరీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తుమ్మల తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటం వల్ల వ్యవసాయానికి మంచి పరిస్థితులు నెలకొన్నాయని, ఎరువులు, యూరియా పూర్తిస్థాయిలో పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.