Monday, March 10, 2025

చేనేత రుణాల మాఫీ

- Advertisement -
- Advertisement -

చేనేత కార్మికుల రుణాల మాఫీ చేస్తూ నేతన్నలకు ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లక్ష రూపాయలలోపు రుణాలు కలిగి ఉన్న చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(జీవోనెం.56) జారీచేసింది. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పునర్జీవం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని, అందులో భాగంగా తొలిదశలో నేతన్నలకు ఉన్న లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో చిన్నచూపుకు గురైన చేనేత రంగాన్ని ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టేందుకు అనేకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని,

దీంతో వారి జీవనోపాధి మెరుగుపడడమే కాకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. చేనేత రంగంలో వస్తున్న సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకునేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటుచేసుకోవడంతో పాటు వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో స్థాపించి వాటికి రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ చేనేత అభయహస్త పథకం అమలుచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేతన్న చేయూత పథకం ద్వారా రూ,290.09 కోట్లతో 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చామని, టెస్కో సంస్థకు రూ.494.48 కోట్లు విడుదల చేసి చేనేత సహకార సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ, మాక్స్ సంస్థలకు పెండింగ్ చెల్లింపులు చేశామని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News