Thursday, September 19, 2024

పేర్లు మార్చి ఏమార్చారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గత పాలనలో కేసీఆర్ ప్రాజెక్టులో కమీషన్ల కోసం కక్కుర్తి పడి నీటిపారుదల వ్యవస్థను సర్వనాశనం చేశారని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మార్చేందుకు ఉద్దేశించబడిన రాజీవ్,ఇందిరా సాగర్ ప్రాజెక్టులే నేటి సీతారామ ప్రాజెక్ట్ అని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.అటువంటి నీటి పారుదల రంగాన్ని ఐదేళ్లపాటు నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న హరీశ్ రావు ఆ తరువాత ఐదేండ్లు అదే శాఖను పర్యవేక్షించిన కేసీఆర్ లు భ్రష్టు పట్టించింది చాలక ఇప్పుడు గోబెల్స్ ప్రచారంతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తాపత్రయ పడుతున్నారని మండి పడ్డారు.ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎర్రమంజిల్ లోని జలసౌధ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

మంత్రులు యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటిలు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ గడిచిన పదేళ్లుగా నాశనం చేసిన నీటి పారుదల రంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.మీ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, సాధించిన ఫలితం శూన్యమని వారు దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల ఆయకట్టును కొత్తగా సేద్యంలోకి తీసుక రాలేక పోయారని విమర్శించారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు.యస్.ఎల్.బి సి,డిండి,నెట్టెంపాడు,భీమా,కల్వకుర్తి, కోయిలసాగర్ ,పాలమూరు ఎత్తి పోతాల పధకాలు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.కేవలం రూ.3505 కోట్లతో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన రాజీవ్,ఇందిర సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావలసి ఉండగా, కమిషన్ లకు కక్కుర్తి పడిన బి ఆర్‌ఎస్ సర్కార్ సీతారామ ప్రాజెక్ట్ గా పేరు మార్చి రీ-డిజైనింగ్ పేరుతో ఆ మొత్తాన్ని ఏకంగా రూ.18,286 కోట్లకు పెంచారని వారు ఆరోపించారు. నాటి ప్రతిపాదనల ప్రకారం కేవలం 349 మెగా వాట్ల విద్యుత్ సరిపోతుండగా,

మామా అల్లుళ్ళ నిర్వాకంతో ఇప్పుడు రెట్టింపు అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారం లో ఉండగా 2016 లో సీతారామ ప్రాజెక్టుకు 7,926 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం దిగిపోయే నాటికి రీ-డిజైన్ పేరుతో రూ.18 వేల కోట్లకు చేరడం వెనుక ఉన్న మతలబు కమిషన్ లకు కక్కుర్తి పడడమేనని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ లకు సి డబ్ల్యూ సి అనుమతులు ఉన్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయన్నారు మేమే తెచ్చామంటూ బి ఆర్ యస్ నేత హారిష్ రావు మాటల్లో నిజమే లేదంటూ తాజాగా సి డబ్ల్యూ సి చేసిన ప్రకటనను వారు ఉదహరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోటే అనుమతులు తుది దశకు చేరుకున్నాయని వారు వెల్లడించారు. మేము చేసిన కృషితోటే 65 టి యం సి ల నీటి కేటాయింపులు సీతారామ ప్రాజెక్ట్ కు రాబోతున్నాయన్నారు.సీతారామ ప్రాజెక్ట్ పనులు బి ఆర్ యస్ ప్రభుత్వ హయాంలో జరిగింది కేవలం 39 శాతం మాత్రమే నన్నారు.ఇప్పుడేమో అదంతా మా గొప్ప తనమే నంటూ గొప్పలు

చెప్పుకుంటున్న బి ఆర్ యస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఎకరాకు నీళ్లు ఎందుకు పారించ లేక పోయారని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు సూటిగా హరీష్ రావును ప్రశ్నించారు.ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.87 కోట్లు ఖర్చు పెట్టి 16,000 వేల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడంతో పాటు, లక్షా పదివేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించ బోతున్నామన్నారు.నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని, గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సంకల్పం అని వారు పేర్కొన్నారు.డబ్బు ఎక్కడ మిగులుతోందో అక్కడ మాత్రమే పనులు చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని వారు విమర్శించారు.ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం మానుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు హరీష్ రావుకు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News