కాంగ్రెస్ ప్రజా పాలనలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం సాయంత్రం తనను కలుసుకున్న మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం మాదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదు, నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో క్రెడిబులిటీ ఉన్న నాయకుడిగా చెబుతున్న ఇంతకంటే మంచి పాలన ఇంతవరకు నేను చూడలేదు అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంతో ఎవరు ఆందోళన చెందొద్దని ఆయన కోరారు.
అధికారులపై మంత్రి ఆగ్రహం
తన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంపై స్థానిక ఇంజనీర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట చీఫ్ ఇంజనీర్తో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులు వెంటనే హైదరాబాద్ రావాలని ఈఎన్సీని ఆదేశించారు.