కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించడం విడ్డూరం పదేళ్లలో లక్ష కోట్లు
దోచుకుతిన్నారు విరుచుకుపడిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాడు
సోనియాకు పాదాభివందనం చేసి నేడు విమర్శలా?: కోమటిరెడ్డి
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసిఆర్)పై మంత్రులు ఫైర్ అయ్యారు. పదేళ్ళు అధికారం అనుభవించడం.. కుటుంబపాలనతో తెలంగాణను సర్వనాశనం చేసింది బిఆర్‌ఎస్ పార్టీయేనని మండిపడ్డారు. లక్షలకోట్లు దోచుకుతిని తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్‌గా అన్న ట్లు చిత్రీకరించడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలోని కంచనపల్లి, బక్కతాయికుంట, నర్సింగ్‌భట్ల, పొనుగోడు ప్రాంతాల్లో రూ.44 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు.. నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు భవనాల సముదాయాలకు నీటిపారుదల, పౌర, ఆహార సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ.. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మా ట్లాడిన తీరుపై మండిపడ్డారు. రూ.1.81 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రాజెక్టులు నిర్మించి ఒక్క ఎకరాకు
కూడా నీరు ఇవ్వలేదని చెప్పారు. లక్షల కోట్లు దోచుకొని దాచుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలో కట్టడం.. కూలడం జరిగిందన్న విషయం మరిచిపోవద్దని గుర్తుచేశారు. కృష్ణానీటి పంపకాల్లో ఆంధ్రకు మద్దతు తెలిపి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కెసిఆర్ హయాంలో ఉమ్మడినల్లగొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ దేవత సోనియా అని నిండు అసెంబ్లీలో మాట్లాడటం.. కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్ళి ఆమె కాళ్ళుమొక్కి వచ్చిన కెసిఆర్ ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని విడ్డూరంగా ఉందన్నారు. కెసిఆర్‌ది నోరా? డ్రైనేజీ మోరా? నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘పదేళ్ళలో లక్షల కోట్లు దోచుకున్నరు.. విదేశాల్లో దాచుకున్నరు.. అని బిఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. రజతోత్సవ సభలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెప్పాలన్నారు.