ప్రతి జిల్లాలో అర్హులందరికీ నాలుగు పథకాల
వర్తింపు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన
అధికారులు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31లోపు
పూర్తి చేసే లక్షంతో ప్రభుత్వం కసరత్తు :డిప్యూటీ
సిఎం భట్టి విక్రమార్క
రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాగుభూమికి భరోసా : తుమ్మల నాగేశ్వర్‌రావు
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు : పొంగులేటి
మన తెలంగాణ / హైదరాబాద్ : నాలుగు సంక్షేమ పథకాలు రై తు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేష న్ కార్డులు ఈ పథకాలను ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుని అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లక్షలాది సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జనవరి 26న అత్యంత పరమ పవిత్రమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ఈ సంక్షేమ పథకాల అమలును ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నూరు శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామని, మార్చి నెల వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని నిరుపేద, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉదాత్త ఉన్నతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యం అని తెలిపారు.
మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆయన ప్రకటించారు. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండని ఆయన తెలిపారు. బీపీఎల్ కుటుంబాలందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారని, మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు, కొత్త సభ్యుల చేర్పులకై దరఖాస్తులు కూడా స్వీకరిస్తారని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించారని తెలిపారు. ఆదివారం ప్రారంభించే నాలుగు పథకాలపై గ్రామసభల్లో ప్రజా అభిప్రాయలు ఫీడ్ బ్యాక్ లను తీసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలు, ప్రజా పాలన సేవా కేంద్రాలలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంఆర్‌ఓ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరుకు గాను దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొన సాగుతుందని స్పష్టం చేశారు.
వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ యోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్దిదారులను గుర్తించారని, ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్నిబదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీలలో కలపడం జరిగిందని, ఈ గ్రామాల్లో 2023 -24 లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలో తీసుకోవడం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు : సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబితా, ఇంటి స్థలం లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించారని, అలాగే కొత్తగా గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించారని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను కేటాయించామని, మొదటి దశలో ఇవి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆవాసయోగ్యంగా ఉన్న రెండు పడకల ఇళ్లను కూడా పంపిణీ చేస్తామని, లాటరీ విధానం కాకుండా అర్హతను బట్టి వాటిని ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.