కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాలను కేంద్రం పూర్తిగా పక్కన పెట్టిందని, రాష్ట్ర పునర్ వ్యవస్థికరణ 2014 చట్టం హామీలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా ప్రస్తావనే లేకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగాన్నీ కుదేలు చేసింది,
హైదరాబాద్ నగరాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపింది, తెలంగాణా అభివృద్ధిని అడ్డుకునేందుకే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. సంక్షేమ రంగానికి నిధుల కోతలు విధించడమే కాకుండా ఆహార భద్రతకు తూట్లు పొడించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు చేతిలో మరోమారు తెలంగాణ మోసపోయిందని, తెలంగాణా ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని ఆయన వివరించారు.