విద్యుత్ సరఫరాకు ఢోకాలేదు
మోటార్లు కాలిపోతున్నాయని,
బోర్లు ఎండిపోతున్నాయని కొన్ని
శక్తుల దుష్ప్రచారం అధికార
యంత్రాంగం రైతులతో
సమన్వయం చేసుకోవాలి,
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి సాగు నీటి కొరత లేకుండా
చూడండి కలెక్టర్లు, ఎస్‌పిలతో
మంత్రులు ఉత్తమ్, తుమ్మల,
సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
మన తెలంగాణ/హైదరాబాద్: రైతన్నల చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు జిల్లాల్లో యం త్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంత్రు లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, వ్యవసాయ, సాగునీరు, విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు డోకా లేదని, నీటి వనరుల కొరతలేకుండా చూడాలని, కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు చే సే అసత్య ప్రచారాలను గుర్తించి ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, ప్రజలకు, రైతాంగాన్ని ఆందోళనకు గురిచేసే సంఘటలకు కారకులను గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడా గోప్యతలేకుండా క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలు బాహ్య ప్రపంచానికి వివరించాలని, చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమనే విషయాన్ని గుర్తించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చే శారు.
సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయని, ఈవిషయంలో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ పంట మరో పక్షం రోజుల్లో చేతికి రానున్నందున ఆయా జిల్లాల అధికారులు సమన్వయంతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటు నందించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో నిజ నిజాలు తెలుసుకోకుండా పంట నష్టం గురించి జరుగుతున్న ప్రచారం సత్య దూరమని తెలిపారు. బోర్లు ఎండి పోవడమో,మోటార్లు కాలి పోవడం వంటి పరిణామాలతో పంట నష్టం జరుగుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు కొన్ని శక్తులు రంగంలోకి దిగాయని అలాంటివాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రబీ పంట విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్నిఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమగ్ర సమాచారం తెప్పిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుని అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ కు 1.5 టి.ఎం.సి నీటిని విడుదల చేయడంతో పాటు పంప్ హౌజ్ ల మరమ్మతులు చేపట్టినట్లు ఆమె వివరించారు.