వందేళ్లు చరిత్ర గల నిజాంసాగర్ చెక్కు చెదరలేదని, కానీ లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాలో స్థానిక ఎంఎల్‌ఎ తోట లక్ష్మీకాంత్ రావు, బాన్సువాడ, బోధన్ ఎంఎల్‌ఎలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో కలిసి శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ఆయన విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని, త్వరలోనే నాగమడుగు, లెండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కేవలం 3600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందన్నారు.
త్వరలోనే నాగమడుగు, లెండి ప్రాజెక్టులు పూర్తి చేసి జుక్కల్ నియోజకవర్గంలోని భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిర్మించి నాటినుంచి నేటివరకు నిర్వహణ లేదని, కాల్వల్లో చెట్లు, ముళ్ల పొదలతో పూడిపోయాయని ఎంఎల్‌ఎలు మంత్రి దృష్టికి తేగా, కాల్వల్లో పూడికలు తీసి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు నీటి పారుదల రంగంలో భారీ అవినీతి, అక్రమాలు చేసి నష్టం చేకూర్చిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి కొత్త ఆయకట్టుకు నీరు అందించలేదని విమర్శించారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు వ్యవసాయానికి, నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు బోనస్ ఇచ్చామన్నారు. పంటల బీమాను పునః ప్రారంభిస్తామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా ప్రణాళికలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు విజ్ఞప్తి మేరకు నాగమడుగు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, లెండి ప్రాజెక్టు పనుల గురించి మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి, అవసరమైతే తానే అక్కడికి వెళ్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో నీటి పారుదల రంగం, ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖాధికారులు, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.