పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని.. ఏకంగా రూ.56వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి చెప్పారు. మంగళవారం నగరంలోని సివిల్ సప్లై భవన్ లో మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలన్నారు. 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది మనం గమనించాలని ఆధికారుకులకు సూచించినట్లు తెలిపారు.
కిలో 39 రూపాయలు పెట్టి బియ్యం సేకరించి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని.. కానీ, అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని అన్నారు. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని.. పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విదంగా ఉండాలి తప్ప.. దుర్వినియోగం కావొద్దని అన్నారు. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామని తెలిపారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.