Friday, December 20, 2024

తెలంగాణ, కాంగ్రెస్ భిక్ష కాదు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ వెంట లక్షలాది మంది కలిసి వచ్చిన రాష్ట్రం

అనేకమంది బలిదానాల ఫలితం
ప్రత్యేక రాష్ట్ర ఆందోళన ఉధృత
స్థాయికి చేరుకున్నందు వల్లనే
కేంద్రం దిగివచ్చింది తామేదో
త్యాగాలు చేసినట్లు కాంగ్రెస్ వారు
చెప్పుకోవడం సబబు కాదు
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు
చూస్తుంటే ఆయన మీద జాలి
కలుగుతోంది ఓటుకు నోటు
దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి
ఆయన తన అజ్ఞానాన్ని బయట
పెట్టుకున్నారు: రాష్ట్ర రోడ్లు,
భవనాల శాఖ మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చింది కాదని, వెనుక కెసిఆర్ వంటి ఉద్యమనాయకులు ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆయన వెనుక లక్షలాది మంది కలిసి నడిచారని…ఇందులో కొంతమంది బలిదానాలు కూడా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆందోళన స్థాయికి చేరుకోవడం వల్లే కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజన చేసిందన్నారు. దీనికే కాంగ్రెస్ నాయకులు ఏదో త్యాగాలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తుందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి వేముల పేర్కొన్నారు, పట్ట పగలు డబ్బు సంచులతో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి రాహుల్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నాయకులు లేక వలస దొంగ నాయకుడిని పిసిసి అధ్యక్షునిగా పెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డితో ఊదు కాలదు…-పీరు లేవదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారన్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కలపాలని రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్ ఘడ్ గ్రామాల ప్రజలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏ ఒక్క సక్కదనం లేదన్నారు. అటువంటి పార్టీకి అగ్రనేతగా కొనసాగుతున్న రాహుల్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కూట్లో రాయి తీయనొడు ఏట్లో రాయి తిస్తడట అన్న చందంగా 50 యేళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు తేలేక పోయిందన్నారు. ఏనాడూ తెలంగాణ ప్రజల పక్షాన,రైతాంగం పక్షాన పార్లమెంట్ లో మాట్లాడని రాహుల్ గాంధీ నేడు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం చేస్తా అంటే రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. గన్ పార్కులో ఉన్న అమరుల స్థూపానికి నివాళులు అర్పించని రాహుల్ గాంధీ నిర్మాణంలో ఉన్న స్మృతి చిహ్నాన్ని సందర్శించారన్నారు. ఇది తెలంగాణ అమరుల త్యాగాలను, రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు.
ఈ పొలిటికల్ టూరిస్టులకు కెసిఆర్ భయం పట్టుకుందన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా తెలంగాణ మీద రాజకీయ మిడతల దండు దండయాత్ర చేస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News