నిజామాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు పదివేల రూపాయలు పంటల పెట్టుబడి, ఐదు లక్షల రూపాయల రైతు బీమా, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్ లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి వేముల సూటిగా ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం బడాభీంగల్, సికింద్రాపూర్, గోనుగొప్పుల, బెజ్జోరా తదితర గ్రామాల్లో సుమారు పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్ద వాగుపై బ్రిడ్జిల నిర్మాణాలు, బీ.టీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, వారిని రెచ్చగొట్టడం తప్ప బిజెపి నాయకులు చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. నిజంగానే బండి సంజయ్ కు దమ్ముంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పి తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని సవాల్ విసిరారు. అప్పటివరకు తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. కాంగ్రెస్, బిజెపి 50 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి, ఏడేళ్ళ తెరాస పాలనలో జరిగిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా, పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ సరఫరా, వైకుంఠధామాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని దేశవ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసిందన్నారు. అందులో పదికి పది గ్రామాలు తెలంగాణలోవే ఎంపికయ్యాయని గుర్తు చేశారు. ఈ సర్వేతో అన్ని అంశాల్లోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. గట్టు మీద నిలబడి రెచ్చగొట్టే వారి మాటలను విశ్వసించకుండా వాస్తవాలు చూడాలన్నారు. ఇదివరకు 60 ఏళ్ళలో జరిగిన కాంగ్రెస్, బీజేపీ పాలనను, తెరాస ఏడేళ్ల పాలనను బేరీజు వేసుకొని తేడాను గమనించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Minister Vemula Prashanth Reddy slams BJP