Tuesday, January 21, 2025

రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేట్టు లేదు: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

minister vemula prashanth reddy who visited munugode

 

చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం డి. నాగారం,దామెరా, చింతల గూడెం గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,ముఖ్య కార్యకర్తలు, ఇంచార్జ్ గా వచ్చిన బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధులతో మంత్రి సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స్థానిక కార్యకర్తలు,ప్రజలతో మంత్రి ముచ్చటించారు. అనంతరం అక్కడే నాయకులు,కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ మునుగోడు ఉపఎన్నిక ఎవరి స్వార్దం కోసం వచ్చిందో ప్రజలు గమనించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక వచ్చేలా చేశారని మండి పడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ కు ఆదరణ పెరుగుతుందని, తెలంగాణలో కెసిఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లో కావాలనే డిమాండ్ వస్తుందని, కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తమ పీఠాలు కదులుతాయని అమిత్ షా పన్నాగంలో భాగమే మునుగోడు ఉపఎన్నిక అని అన్నారు.

కెసిఆర్ ను తెలంగాణలోనే కట్టడి చేయాలని, తెలంగాణ రాజకీయాల్లో బిజీ చేస్తే ఇటు వైపు రాడని కుట్ర పూరితంగా మునుగోడు ఉప ఎన్నికలు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు లో బీజేపీ లేదు నేను రాజీనామా చేయను అని రాజ గోపాల్ అంటే జార్ఖండ్ లో 22 వేల కోట్ల బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజ గోపాల్ రెడ్డితో రాజీనామా చేయించారని అన్నారు. ఇక్కడి ప్రజల అభిప్రాయం చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేట్టు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా కావాలని ప్రజల్లో చర్చ జరుగుతోందనీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు,రైతు నాయకులు తెలంగాణ మోడల్ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఎంతో సంతోషం కలుగతుందన్నారు. దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపిన ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు గర్వంగా అనిపిస్తుందన్నారు. కెసిఆర్ ను కట్టడి చేయడం మోడీ,అమిత్ షా తరం కాదని, దేశవ్యాప్తంగా బీజేపీ అవినీతిని కెసిఆర్ ఎండగడతాడని తేల్చి చెప్పారు.

ఇక్కడ ఒక్కో కార్యకర్త ఒక్కో కేసిఆర్ అని అన్నారు. వారి మాటల్లోని అవేశం వింటుంటేనే తెలుస్తోందన్నారు. తెల్లారితే సుద్దపూసలా,సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మోడీ,అమిత్ షాలు 5జి స్ప్రెక్ట్రం వేలంలో 10 లక్షల కోట్ల కుంభకోణం చేశారన్నారు. 2007 లో 2జి వేలంలో 1.70 లక్షల కోట్లు వస్తే అవినీతి జరిగిందని అప్పుడు మాట్లాడిన ఇప్పటి ప్రధాని మోడీ 15 ఏళ్ల తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన 5జి స్పెక్ట్రం వేలంలో 1.40 లక్షల కోట్లు మాత్రమే వస్తే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సుమారు 10లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ…ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. ఈ స్వాతంత్ర్య భారత దేశంలోనే అత్యంత అవినీతి పరులు మోడీ,అమిత్ షానే అని మంత్రి వేముల మండిపడ్డారు. మునుగోడు ప్రజలు దీన్ని అర్దం చేసుకోవాలని కోరారు. కెసిఆర్ వచ్చిన తర్వాత మార్పును దృష్టిలో పెట్టుకొని ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News