Wednesday, January 22, 2025

అంగరంగ వైభవంగా చెరువుల పండగ

- Advertisement -
- Advertisement -

అంగరంగ వైభవంగా చెరువుల పండగ….
బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు
చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు
ఉత్సవాలల్లో పాల్గొన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్దానిక ప్రజాప్రతినిధులు, అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధుల అధికారులు పాల్గొన్ని ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. గ్రామాల్లోని చెరువుల వద్దకు రైతులు, మత్సకారులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలంతా డప్పుల చప్పులు, పోతురాజుల విన్యాసాలు, డోలు కళాకారుల ఆటలు, బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా బయలుదేరారు. చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు అందంగా అలంకరించారు. కట్టమైసమ్మ, చెరువు నీటికి పూజ చేశారు. తదనంతరం చెరువుల సమీపంలో సభ, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, కోలాటాలు, జానపద పాటలు, గోరేటి వెంకన్న రచించిన చెరువోయి. మాఊరి చెరువు పాటలతో చిందులేశారు. స్దానిక నాయకులు, ప్రజలు కలిసి సహఫంక్తి బోజనాలు చేశారు.
చెరువు పండగ ఉత్సవాల్లో పాల్గొన్న సిఎస్ శాంతికుమారి ః ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెరువు పండగ ఉత్సవాల్లో సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువు వద్ద బతుకమ్మను నెత్తి ఎత్తుకుని మహిళలతో ఆట పాట ఆడారు. అనంతరం చెరువు వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు. స్దానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని ఎక్కడలేని విధంగా చెరువుల అభివృద్ది ః స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రూ. 6 వేల కోట్లతో చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువు కట్టపై నిర్వహించిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు గ్రామ మహిళలు బోనాలు, బతుకమ్మలతో గంగపుత్రులు వలలతో స్వాగతం పలికారు. పోచారం బోనం ఎత్తుకుని నడిచి, అనంతరం చెరువు కట్టపై మహిళలతో బతుకమ్మ ఆడారు.

పల్లె ప్రజల జీవితమంతా చెరువుల చుట్టు ఉండేది ః ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడవెల్లిలో స్దానిక ఎమ్మెల్యే షకీలతో కలిసి చెరువుల పండగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. స్దానిక మహిళలతో కలిసి బోనాలు, బతుకమ్మ ఆటలతో చెరువు గట్టుకు చేరుకుని పూజలు చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముందు 75 ఏళ్ల కితం చెరువుల నిండుకుండలా ఉండేవని, సమైక్యం రాష్ట్రంలో చెరువులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు. తిరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5వేల కోట్లతో 47 వేల చెరువులను మరమ్మత్తు చేసినట్లు తెలిపారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, అవి ఎప్పటికి ఎండిపోవద్దని సిఎం కెసిఆర్ లక్షమన్నారు.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం ః మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం సోమారం, గుర్తూరు చెరువుల వద్ద నిర్వహించిన చెరువుల పండగలో పాల్గొన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలోని నీటి వనరులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్లు జిల్లాలో రూ.179 కోట్లతో 601 చెరువులను, పాలకుర్తి నియోజకవర్గంలో రూ.61 కోట్లతో 331 చెరువులను మరమ్మత్తు చేసినట్లు దీంతో 119 శాతం భూగర్భ జలాలు పెరిగాయన్నారు.

మండుటెండ్లలోను మత్తడి దూకుతున్న చెరువులు ః కొప్పుల ఈశ్వర్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జలవనరులన్నీ జలకళలాడుతున్నాయని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి మండలం ధమ్మనపేట, బుగ్గారం మండలం వెల్గొండ, గోపులపూర్ గ్రామాల్లో నిర్వహించిన చెరవుల పండగ కార్యక్రమంలో పాల్గొన్ని కట్ట మైసమ్మకు బోనాలను సమర్పించి సహపంక్తి భోజనాలు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్దరణలతో వేసవిలో చెరువులు మత్తడులు దూకుతున్నాయన్నారు. నీటి పారుదల రంగంలో రాష్ట్రం అద్బుత ప్రగతి సాధించిదన్నారు.

చెరువుల పునరుద్దరణతో కుల వృత్తులకు జీవం ః సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్దరణ పెద్ద ఎత్తున చేపట్టిందని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వ్యవసాయంతో రైతులు, చెరువులపై ఆదారపడ్డ కులవృత్తులకు పునర్జీవం కల్పించారని కొనియాడారు. సీఎం కెసిఆర్‌కు ఉన్న విజన్‌తో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19లక్షల ఎకరాలకు సాగు పెరిగిందన్నారు.

Ministers participated in Cheruvula Pandaga

నీటి పారుదల రంగంలో అసాధారణ విజయాలు ః మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం కట్టపైన చెరువుల పండగ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈసందర్భంగా చెరువులోని జలానికి గంగా హారతి నిచ్చిని పసుపు కుంకుమ పూలతో ప్రత్యే పూజలు నిర్వహించారు. రెండేళ్ల వ్యవధిలో సుబ్బ సముద్రం మంచినీటి వినియోగానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని, మూసి మురికి నుంచి బయట పడేసిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. చేపల పెంపకంలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు.

అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరి పోసిన నాయకుడు సిఎం కెసిఆర్ ః మంత్రి కెటిఆర్
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరి పోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని మున్సిపల్, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. 10 సంవత్సరాల కితం ఏ చెరువునను చూసినా గుండె బరువెక్కిందని, వాటిపై ఆధారపడిన కులవృత్తుకు బతుకుదెరువు లేదన్నారు. కానీ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రతి చెరువు. కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుగా మారాయని తెలిపారు. చెరువులకు పట్టిన దశాబ్దాల శిలుమును వదిలించిన విప్లవం పేరే మిషన్ కాకతీయని వెల్లడించారు. మండు వేసవిలో కూడా మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా ఈమహాయజ్ఞంలో మనసు పెట్టి పనిచేసిన ప్రతి ఒకరికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ చెరువుల పండగ శుభాకాంక్షలు తెలిపారు.

నాటి పాలకుల నిర్లక్షంతో చెరువులు చిన్నాభిన్నం ః మంత్రి హరీష్‌రావు
నాటి పాలకుల నిర్లక్షంతో గొలుసుకట్టు వ్యవస్ధ చిన్నాభిన్నమైందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ మిషన్ కాకతీయతో చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయన్నారు. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైందన్నారు. మిషన్ అమృత్ సరోవర్ పేరుతో మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ట్విట్ చేశారు. అదే విధంగా సిద్దపేట కోమటి చెరువు తీరాన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పిష్ పుడ్ ఫెస్టివల్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గంగపుత్ర నాయకులు పాల్గొన్నారు.

Ministers participated in Cheruvula Pandaga
సిఎం కెసిఆర్‌తోనే చెరువులకు పూర్వవైభవం ః మంత్రి పువ్వాడ
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని, చెరువుల పండగను జిల్లా ప్రజలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చెరువుల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి, స్దానిక ప్రజలతో కలిసి బతుకమ్మ, బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాగునీటి వ్యవస్ధకు రూపు తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే ః వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
వనపర్తి నల్లచెరువు, తాళ్లచెరువు, అమ్మచెరువు, మర్రికుంట చెరువులపై నిర్వహించిన చెరువుల పండగలకు హాజరై గంగమ్మ తల్లికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పూజలు చేశారు. సాగునీటి వ్యవస్థను తెలంగాణ రూపాన్ని మార్చిన ఘనత సిఎం కెసిఆర్ ఉందని, కృష్ణా జలాలతో నల్ల చెరువు నిండుగా దర్శనమిస్తుందని, దీంతో మరింత సుందరంగా మారిందన్నారు. అన్యాక్రాంతమైన రాజనగరం అమ్మచెరువు, తాళ్ల చెరువులను ఆధునికరించామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News