మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేకాకుండా బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ వైఎంసిఏ గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహకులకు కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ అధికారులు లేఖలు పంపించారు.
విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా శాంతిభద్రతల నిర్వహణ, శోభాయాత్ర, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో మంత్రులు అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.