Sunday, December 22, 2024

నడ్డా వద్ద క్యూ కట్టిన కేంద్ర మంత్రులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వస్థీకరణపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు వరుసగా పార్టీ అద్యక్షుడు జెపి నడ్డా వద్ద క్యూ కడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువు ఉన్న ప్రస్తుత తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు వస్తున్న వదంతులతో పలువురు కేంద్ర మంత్రులు తమ పదవులు ఉంటాయో ఊడతాయో తెలియని కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

గడచిన రెండు రోజుల్లో అరడజను మందికిపైగా కేంద్ర మంత్రులు బిజెపి కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీలో సంస్థాగత పదవులను ఆశిస్తున్న సీనియర్ నాయకులతోపాటు కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న వారు సైతం పార్టీ ప్రధాన కార్యాలయానికి క్యూ కట్టడం గమనార్హం. వీరిలో ప్రహ్లాద్ పటేల్‌తోపాటు ఇటీవలే పంజాబ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన సునీల్ జాకఢ్ కూడా ఉన్నారు. మాజీ రైల్వే మంత్రి దినేష్ ద్వివేదితోపాటు పలువురు కేంద్రమంత్రులు పార్టీ అధ్యక్షుడిని కలుసుకుని రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయ శాఖ మంత్రి అరుజ్న్ రాం మేఘాలవల్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పార్టీ అధ్యక్షుడితో బుధవారం భేటీ అయినట్లు తెలుస్తోంది.

వివిధ అంశాలపై పార్టీ వైఖరితోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి కూడా వారు జెపి నడ్డాతో చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని మదురై నియోజకవర్గం లేదా మరే దక్షిణాది రాష్ట్రం నుంచి అయినా పోటీ చేసే విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో భూపేంద్ర యాదవ్‌కు పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కూడా సంస్థాగతంగా ఒక కీలక బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బిఎల్ సంతోష్‌ను కలుసుకున్నారు. మరో కేంద్ర మంత్రి ఎస్‌పిఎస్ బఘేల్ కూడా పార్టీ అధ్యక్షుడిని కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News