లఖింపూర్‌ఖేరీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్‌ఖేరీ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేయగా విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే విడుదల చేసినట్టు లఖింపుర్ ఖేరీ జైలు సూపరింటెండెంట్ పీపీ సింగ్ తెలిపారు. రూ. 3 లక్షల వంతున ఇద్దరి పూచీకత్తు సమర్పించారు. అరెస్టయిన నాలుగు నెలల తరువాత మంగళవారం విడుదలయ్యారు. ఆశిష్ మిశ్రా గత అక్టోబర్ 10 నుంచి జైలులో ఉంటున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే బిజెపి నేత ఆశిష్ మిశ్రాకు బెయిలు లభించడం విశేషం. మరోవైపు కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తన కుమారుడి నివాసానికి చేరుకున్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులతోసహా మొత్తం 8 మంది మృతి చెందారు.
బెయిలుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం : రాఖేష్ తికాయిత్
మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు కోర్టు బెయిలు మంజూరు చేయడంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని రైతు నాయకుడు రాఖేష్ తికాయిత్ మంగళవారం వెల్లడించారు. లఖింపూర్ ఖేరీ సంఘటనపై యావత్ దేశం, ప్రపంచం చూస్తోందని, రైతులతోపాటు ఎనిమిది మంది హత్యలకు, ప్రధాన కారకులైన అజయ్‌తెని, ఆశిష్ తెని బెయిలుపై మూడు నెలలకే బయటకు రావడం దారుణమని తికాయిత్ విమర్శించారు.