Friday, December 20, 2024

తాటాకు చప్పుళ్లకు బెదరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులను మంత్రులు. తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్‌లు ఖండించారు. టిఆర్‌ఎస్ నాయకులపై ఐటి, ఇడి దాడులను ముందే ఊహించామని, కేంద్రం తాటా కు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. కేంద్ర సంస్థల దాడులను సమర్ధంగా ఎదుర్కొంటామన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టడంపై మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్‌లు స్పందించారు. కేంద్ర సంస్థల దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని వారు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. కేంద్ర సంస్థలు చేస్తున్న దాడులను ఎదుర్కొంటామని, ఈ దాడులు ముందే ఊహించామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు.

సిఎం ముందే దాడుల గురించి చెప్పారని, ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు, రేపు మా చేతిలో ఉండొచ్చు. జరుగుతున్న పరిణామాల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలను చైతన్యం చేసి మేం ఏమిటన్నది వ్యవస్థలకు చూపిస్తామన్నారు. రొటీన్‌గా చేసే దాడులను ఎవరూ తప్పుపట్టరని, అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకు ఉంటామని, ఏం జరుగుతుందో భవిష్యత్‌లో చూస్తారని ఆయన తెలిపారు. లక్ష్యంగా చేస్తున్న దాడులకు టిఆర్‌ఎస్ నాయకత్వం భయపడదని ఆయన పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన 15 నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధుల జనరల్ బాడీ సమావేశం తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తామని తలసాని తెలిపారు.

కేంద్రం చర్యలకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కేంద్రం చర్యలకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుందని, మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటి దాడులు దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాలను కలుపుకొని కేంద్రం పని చేయడం మానుకొని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

భగ్గుమన్న టిఆర్‌ఎస్ శ్రేణులు

రాష్ట్రంలో జరుగుతున్న ఐటి దాడులపై టిఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News