మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతోంది. నేటి నుంచి గాంధీభవన్‌లో ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి’ కార్యక్రమం అమల్లోకి రానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండేటట్లు పిసిసి కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తగా నియమితులైన పిసిసి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహారిస్తూ కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. గాంధీభవన్‌లో మంత్రులు, సిఎం, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మహేశ్‌కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు వారంలో రెండు రోజులు మంత్రులు, రెండు వారాలకు ఒక్క రోజు సిఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో ఉండేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీని బలోపేతం చేయడం ఎలా?
సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో కూడా చర్చించిన తర్వాత ఈ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నట్లు పిసిసి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ప్రతి రోజు గాంధీభవన్‌లో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. పూర్తిస్థాయి పిసిసి అధ్యక్షుడు కావడంతో పార్టీని బలోపేతం చేయడం ఎలా? కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే దానిని ఏ విధంగా పరిష్కారం చేయాలి? తదితర అంశాలపై గాంధీ భవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని పిసిసి ప్రకటించింది. వారంలో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం గాంధీభవన్‌లో ఓ మంత్రి అందుబాటులో ఉంటారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు మంత్రులు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమం నేటి నుంచి గాంధీభవన్‌లో మొదలు కానుంది. దీనివల్ల పార్టీ అధ్యక్షుడికి, మంత్రులకు మధ్య సత్ససంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలోపేతానికి కార్యాచరణ చేపట్టినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మంత్రుల షెడ్యూల్ ఖరారు
దీనిపై వచ్చే స్పందనను దృష్టిలో ఉంచుకొని మార్పులు, చేర్పులు చేస్తారని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత సిఎంతో చర్చించిన పిసిసి అధ్యక్షుడు, గాంధీ భవన్‌లో మంత్రులు ప్రజలతో ముఖాముఖి షెడ్యూల్‌ను ఖరారు చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ఇదే….
25వ తేదీన – దామోదర రాజనర్సింహ
27వ తేదీన – శ్రీధర్ బాబు
అక్టోబర్ 04వ తేదీన – ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్ 09వ తేదీన – పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 11వ తేదీన సీతక్క
అక్టోబర్ 16-వ తేదీన – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అక్టోబర్ 18వ తేదీన కొండా సురేఖ
అక్టోబర్ 23-వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అక్టోబర్ 25 -వ తేదీన జూపల్లి కృష్ణారావు
అక్టోబర్ 30వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు