Thursday, January 23, 2025

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నామని అన్నారు. సోమవారం మధిర పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ& సరైన సమయంలో సరైన వేదికపై ఈ శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు.

బిఆర్‌ఎస్ పాలనలో సంస్థలు, వ్యవస్థలు నిర్వీర్యం
నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, కానీ బీఆర్‌ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం, సంపద దోపిడీకి గురైందని ఆరోపించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోగా ఉన్న స్వేచ్ఛను సైతం హరించిందని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ పాలన అస్తవ్యస్తంగా కొనసాగగా సంపద దోపిడీకి గురి కావడం, సంస్థలు, వ్యవస్థలు నిర్వీర్యం, విచ్ఛిన్నం అయ్యాయని అన్నారు. భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యవస్థీకృతమైన సమాజాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 70 సంవత్సరాల వెనుక ఉన్న ఆర్థిక అసమానతలు కలిగిన ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించిందని వ్యాఖ్యానించారు.ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ, సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన కుట్రపూరితమైన పాలనకు ఇక చరమగీతం పాడుతున్నామని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా దర్బార్లు
ప్రజా దర్బార్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని. ప్రజలు ఇచ్చిన వినతులపై తిరిగి సమాధానాలు స్పష్టంగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామన్నారు. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా, జవాబుదారీగా లేకుండా గ్రీవెన్స్ నిర్వహించాయని, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయలేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు.

మధిర అభివృద్ధ్దిపై ప్రత్యేక డాక్యుమెంటరీ
మధిర నియోజకవర్గం అభివృద్ధిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని,. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ నాయకులను కూడా ఆహ్వానిస్తామని మల్లు భట్టి తెలిపారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాలి? భవిష్యత్తు అవసరాలు ఏంటి? ఐదు ఏండ్లలో ప్రణాళికాబద్ధంగా ఎలా అభివృద్ధి చేయాలి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తోడు తనకున్న ఆలోచనలను జోడించి త్వరలో డాక్యుమెంటరీ తయారు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వివిధ రంగాల నిష్ణాతులు, మేధావులు సలహాలు సూచనలు ఇవ్వొచ్చని ఆయన అన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని, ఇందులో ఎలాంటి బేషజాలు లేవన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పనిచేస్తామని, ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చని భట్టి తెలిపారు. కాగా, చారిత్రాత్మకమైన ప్రజల తీర్పు తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో దేవాలయంలా భావించే అసెంబ్లీలో ఈ నెల 14 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News