బీహార్ రోహతాస్ జిల్లాలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో శుక్రవారం ఒక మైనర్ బాలుని కాల్చిచంపారని, మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. పదవ తరగతి విద్యార్థి అమిత్ కుమార్ చికిత్స సమయంలో గాయాలతో మరణించగా, ఈ నేరానికి సంబంధించి అతని సహ విద్యార్థిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పి) రౌషన్ కుమార్ తెలియజేశారు. ‘గురువారం ససారంలో ఒక పరీక్ష కేంద్రం లోపల రెండు వర్గాల విద్యార్థుల మధ్య తగవులాట జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది& అమిత్; మరొక విద్యార్థి సంజిత్ కుమార్ ఒక ఆటోరిక్షాలో ఇంటికి తిరిగి వెళుతుండగా వారిని ఒక సహ విద్యార్థి ఆపివేసి, వారిపై కాల్పులు జరిపి పారిపోయాడు’ అని ఆయన వివరించారు. పోలీస్ బృందం ఆ ప్రదేశానికి చేరుకుని వారిద్దరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది.
‘అమిత్ చికిత్స సమయంలో మరణించగా, సంజిత్ పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది. కేసు నమోదు చేశారు. తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన మైనర్ బాలుని నిర్బంధంలోకి తీసుకున్నారు. దర్యాప్తు సాగుతోంది’ అని ఎస్‌పి తెలియజేశారు. సంఘర్షణకు, ఆ తరువాత కాల్పులకు అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. పోలీసుల తుపాకిని, నిందిత మైనర్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత మృత విద్యార్థి కుటుంబ సభ్యులు సమీపంలోని రహదారిని మూసివేసి, టైర్లను దగ్ధం చేయడం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. నిందితునిపై తక్షణ చర్య కోరుతూ నిరసనకారులు రహదారిపై మృతుని శవాన్ని అట్టిపెట్టారు. పోలీస్ సీనియర్ అధికారుల జోక్యం తరువాత ఆ అవరోధాన్ని తొలగించినట్లు అధికారి ఒకరు తెలిపారు.