కలబుర్గి: కర్నాటకలోని కలబుర్గి జిల్లాలో ఒక 9 ఏళ్ల బాలికపై 12-14 మధ్య వయసున్న ఐదుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు.
సామైహిక అత్యాచారానికి గురైన బాలికను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు వారు చెప్పారు. 2 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని రిమాండ్ హోమ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఐదవ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. కలబుర్గి మహిళా పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగినట్లు వారు తెలిపారు. తన ఇంటి ముందు కూర్చుని ఉన్న ఆ బాలికను ఈ ఐదుగురు బాలురు ప్రలోభపెట్టి చాక్లెట్ కొనిస్తామన్న పేరుతో ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
సమీపంలోని ఒక ఇంటి మిద్దెమీదకు తన కుమార్తెను తీసుకెళ్లి మైనర్ బాలుర జట్టు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం స్కూలుకెళ్లిన బాలిక మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత బయట కూర్చుని బాదం పప్పు పగలగొడుతున్న సమయంలో ఈ బాలురు వచ్చి తన కుమార్తెను తీసుకెళ్లారని ఆమె తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఎవరికైనా ఈ విషయం చెబితే చంపివేస్తామని తన కుమార్తెను బెదిరించారని, ఎలాగోలా కష్టపడి ఇంటికి వచ్చిన తన కుమార్తె జరిగిన విషయాన్ని తనకు చెప్పినట్లు తల్లి తెలిపారు. వెంటనే పోలీసులు ఆ బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.