Thursday, December 12, 2024

నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

- Advertisement -
- Advertisement -

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతిచెందింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన 17 ఏళ్ల యువతి నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర ఫంక్షన్లకు డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా రాఘవేంద్ర, యువతి వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లి ఆమెను నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపి చదివిస్తున్నారు. ఆరు నెలల క్రితం రాఘవేంద్ర నందికొట్కూరుకు వచ్చాడు. అక్కడ కూడా వేధింపులకు పాల్పడుతుండటంతో అవ్వాతాత విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చేరవేశారు.

స్నేహితులు ఎవ్వరినీ ఇంటికి రానివ్వొద్దని యువతి తల్లి సూచించింది. ఇంట్లోని పైగదిలో తాత, అమ్మమ్మ ఉంటుండగా బాలిక కింది గదిలో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాఘవేంద్ర గది వద్దకు చేరుకున్నాడు. తలుపు కొట్టడంతో నిద్రిస్తున్న సదరు యువతి గడియ తీసింది. కొద్దిసేపటికే ఆమెను అరవకుండా నోట్లో బట్టలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఘటనా స్థలంలోనే విద్యార్థిని మృతి చెందింది. పెద్దఎత్తున పొగలు రావటం మంటలు అంటుకోవడంతో రాఘవేంద్ర బయటకు పరుగులు తీశాడు. అప్పటికే కాలిన గాయాలతో రాఘవేంద్ర ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు.

ఘటనా స్థలాన్ని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పరిశీలించారు. పెట్రోల్ దాడి ఘటనపై మంత్రి బిసి జనార్దన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యువతి మృతి అత్యంత బాధాకరమని చెప్పారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News