హైదరాబాద్: నగరంలో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మైనర్ బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 24వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకాల ఉన్న రోడ్డులో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో రోడ్డు దాటే సమయంలో ముగ్గురు యువకులు కూర్చున్న ఓ ద్విచక్ర వాహనం మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఒక మైనర్ బాలిక తీవ్రంగా గాయపడింది. అనంతరం ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు గాయపడిన బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ఆ వాహనానికి ముందువైపు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Minor girl injured in Road Accident at Balkampet