పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అదనపు పోస్టుల సృష్టిలో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టులో ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని సుప్రీం కోర్టు తాజాగా పక్కనపెట్టింది. అదనపు పోస్టుల సృష్టిపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. పశ్చిమబెంగాల్ విద్యాశాఖ నిపుణులతో చర్చించిన తర్వాతనే ఈ అదనపు పోస్టులను సృష్టించిందని, దీనికి గవర్నర్ నుంచి ఆమోదం లభించిందని, అలాంటప్పుడు ఇందులో న్యాయమైన జోక్యం అవసరం లేదని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే టీచర్ల నియామకాల్లో ఇతర అవకతవకలకు సంబంధించిన ఇతర అంశాలు, ఆరోపణలపై సీబిఐ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.2016 లో పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయులతోపాటు సిబ్బంది నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం, దీనిపై కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టు ఈ ప్రక్రియ చెల్లదని తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రతోపాటు అవకతవకలపై దర్యాప్తు జరపాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు .. సిబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. తాజాగా అదనపు ఉద్యోగాల సృష్టిపై దర్యాప్తు అవసరం లేదంటూ తీర్పు చెప్పింది.