30 శాతం ఓటర్ల మొగ్గు టిఎంసివైపే?
బిజెపిపై అయిష్టత, లెఫ్ట్ కాంగ్రెస్‌పై అపనమ్మకం
మసీదుల నుంచే ఇమామ్‌ల పిలుపు కీలకం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార టిఎంసికి, మమతకు మైనార్టీలే పెట్టనికోటలు అవుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కూడా మైనార్టీలు టిఎంసికే అత్యధికంగా ఓటేస్తారని వెల్లడయింది. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యలో మైనార్టీలు దాదాపు 30 శాతం వరకూ ఉంటారు. తమ ఓట్లు ఎక్కువగా టిఎంసికే ఉంటాయని మైనార్టీ వర్గాల నేతలు తెలిపారు. బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉనికిని చాటుకోకుండా చేయాలనే మమత బెనర్జీ సంకల్పానికి ఇక్కడి మైనార్టీల బలమే కీలకం అవుతోంది. ఓ వైపు రంగంలో కాంగ్రెస్ వామపక్షాల కూటమి రూపంలో లౌకిక ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ మైనార్టీలకు మమతనే దిక్కు అయింది.
టిఎంసి పట్ల వారి మమత వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాలలో గెలుపోటములను నిర్ధేశించే రీతిలో ముస్లింల ఓట్లు ఉన్నాయి. తమకు కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ పట్ల పెద్దగా అభిమానం లేదని, తమలో అత్యధికులం దీదీ పార్టీ వైపు ఉంటామని, ఎన్నికలు ఓట్లు ఒక్కటే కాదు ఇతరత్రా కూడా తాము టిఎంసి వైపు ఉండటం జరుగుతోందని ముస్లిం నేతలు కొందరు తెలిపారు. ఎందుకు అంటే మమతాజీ సారధ్యంలో టిఎంసి ఎప్పటికప్పుడు తమ బాగోగులు చూసుకుంటుందని వివరించారు. బిజెపిని తాము నమ్మడం లేదు. బిజెపిపై టిఎంసి పోరు సల్పుతోంది. ఇక లెఫ్ట్ కాంగ్రెస్ కూటమిపై పెద్దగా ఆశలు లేవని నేతలు తెలిపారు. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారే మెజార్టీ పక్షం అవుతోంది.
మరో కీలక విషయం ఏమిటంటే జమ్మూ కశ్మీర్‌తరువాత అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రం బెంగాల్. అయితే ఇక్కడి అథికార పక్షం పనితీరు పట్ల ఇటీవలి కాలంలో ముస్లింలలో కొంత మేర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే బిజెపి తమకు అన్యాయం చేస్తున్నందున దీనిని ఎదుర్కొనేందుకు బలీయమైన నాయకత్వపు టిఎంసినే తమకు పెద్ద దిక్కుఅవుతోందనిముస్లిం వర్గాలు తెలిపాయి. మైనార్టీల ఓట్లు చీలుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే అటువంటిదేమీ ఉండదని అత్యధిక ఓట్లు టిఎంసి వైపు పడుతాయని , మరీ ఎక్కువగా ఈసారి రంజాన్ నెల కూడా రావడంతో ఈ విధమైన ఓటు కట్టుబాట్లు ఇప్పటికే ఖరారయ్యాయని స్థానికంగా పలు మసీదులలో మత ప్రతినిధిగా ఉండే ఇమామ్ ఏ దిన్ ఖ్వాజీ ఫజ్లుర్ రెహ్మన్ తెలిపారు.
అయితే కొన్ని జిల్లాల్లో ఈసారి ఓటర్లు టిఎంసి లేదా వేరే ప్రత్యామ్నాయం ఎంచుకునేందుకు సిద్ధం అవుతున్నారని వెస్ట్‌బెంగాల్ ఇమామ్‌ల సంఘం అధ్యక్షులు మెహమ్మద్ యాహ్యా తెలిపారు. ఇమామ్‌ల సందేశాలద్వారానే బెంగాల్‌లోని ముస్లింలు అత్యధికంగా తమ ఓటును ఖరారు చేసుకుంటారు.ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలలో కూడా ముస్లింలు టిఎంసి వెన్నంటే ఉంటారని యాహ్యా తెలిపారు. ముస్లింలకు దాదాపుగా 40వేలకు పైగా మసీదుల నుంచే ఓటు ఎటు అనే సందేశం సకాలంలో అందుతుంది. దీనినే అత్యధికులు పాటిస్తారు. ఇక గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం ఓట్ల చీలికలతో ఉత్తర్ దినాజ్‌పూర్‌లో, మాల్దాల్లో బిజెపి విజయం సాధించింది. అయితే ఈ సారి ఈ విధంగా జరగకుండా మమత అన్ని విధాలుగా తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నారు.