హైదరాబాద్ : రాష్ట్రంలో బిసిలకు అందిస్తున్న మాదిరిగానే మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని 100 శాతం సబ్సిడీతో అందజేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాకార పథకం కింద సబ్సిడీ రుణాలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం సబ్సిడీ కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పెండింగ్ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
క్రైస్తవ లబ్దిదారులను ఎంపిక చేయడానికి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన క్రైస్తవుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ గ్రాంటును అందజేయడం జరుగుతుంది. దరఖాస్తు దారుడు 21 ఏళ్ళ నుండి 55 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు దారుని వార్షికాదాయం పట్టణాలలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలకు మించి ఉండరాదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్తాయి మానిటరింగ్ కమిటీ/ జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. పూర్తి చేసిన లబ్దిదారుల జాబితాను జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తీసుకోవడం ద్వారా తుది జాబితాను సిద్దం చేస్తారు. సెలక్షన్ లీస్ట్ (దశలవారిగా) తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్ నందు పొందు పరుచడం జరుగుతుంది. సబ్సిడీని వన్‌టైమ్ గ్రాంట్‌గా విడుదల చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిలు చర్యలు తీసుకుంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు.