Wednesday, January 22, 2025

మైనారిటీలను విద్యకు దూరం చేసే కుట్ర

- Advertisement -
- Advertisement -

పిజి పూర్తి చేసి ఎంఫిల్, పిహెచ్‌డి ప్రవేశాలు పొందిన మైనారిటీ అభ్యర్థులకు ఆర్ధిక వెసులుబాటు లేకపోవడం వల్ల పై చదువులు చదివే వారికి నిరోధకంగా మారింది. అల్పసంఖ్యాక వర్గాల వారిని ఈ వెనుకబాటుతనం మరింతగా బాధిస్తుంది. ఈ ఆటంకాన్ని తొలగించడానికి 2009లో అప్పటి యుపిఎ ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ పేరిట ప్రత్యేక ఉపకార వేతనాలు ప్రవేశపెట్టింది. వీటి వల్ల లబ్ధి పొందుతున్నవారు ఇతర ఉపకార వేతనాలు కూడా అందుకుంటున్నారన్న నెపంతో మోడీ ప్రభుత్వం వీటిని ఈ మధ్య రద్దు చేసింది. తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేసిన మౌలానా ఆజాద్ ముస్లిం కావడం, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలు అధికంగా ఉంటారు కనకే మోడీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టు కనిపిస్తోంది.

దేశ జనాభాలో 14.2 శాతం మంది ఉన్న ముస్లింలలో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చేరే ముస్లిం విద్యార్థులు మాత్రం కేవలం 5.5 శాతం ఉన్నారు. దేశ జనాభాలో 16.5 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారు 14.7 శాతం ఉన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలవారి పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. 2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ పరిస్థితి వెల్లడైంది. ఈ ప్రయోజనం పొందే వారిలో ముస్లింలే ఎక్కువగా ఉండడానికి కారణం ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారితో పోలిస్తే ముస్లింలు అధిక సంఖ్యాకులు కావడమే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2018 -19లో మౌలానా ఆజాద్ పేరిట నెలకొల్పిన ఉపకార వేతనాల్లో వెయ్యి మంది వీటిని వినియోగించుకుంటే అందులో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోడీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు.

ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యా సంస్థల లోపల, వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని గట్టుకుని బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం. గత 12వ తేదీన వందలాది మంది విద్యార్థులు న్యూఢిల్లీలో విద్యాశాఖ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులు నిరసనను అనుమతించకుండా వారందరినీ పోలీసు వాహనాల లోకి ఎక్కించి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. ఈ ఉపకార వేతనాల రద్దు అంశాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గఢీ, బహుజన సమాజ్ పార్టీకి చెందిన డానీష్ అలీ, మజ్లిస్‌కు చెందిన ఇంతియాజ్ జలీల్ లేవనెత్తారు. అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యుపిఎ ప్రభుత్వం న్యూఢిల్లీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన రాజీందర్ సచార్ కమిటీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఇతర మతాల వారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్ కమిటీ పేర్కొంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 20 ఏళ్లకు పైబడిన వారిలో 7 శాతం ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉంటే ముస్లింలలో మాత్రం ఇది కేవలం నాలుగు శాతం మాత్రమే ఉందని సచార్ కమిటీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాల వారితో పోల్చి చూసినా ముస్లింల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని సచార్ కమిటీ తెలియజేసింది. ఆ కమిటీ సిఫార్సు పర్యవసానంగానే మౌలానా ఆజాద్ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది. ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతాల వారందరికీ వర్తిస్తుంది. విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందుకుంటున్నందు వల్ల మౌలానా ఆజాద్ ఉపకార వేతన పథకాన్ని రద్దు చేస్తున్నామని గత నెల 8వ తేదీన అల్పసంఖ్యాక వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు.

విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయోజనంపొందే అవకాశం వున్నా ఒక ఉపకార వేతనం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్ ఉపకార వేతన పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పిహెచ్‌డి పరిశోధక విద్యార్థులే. పరిశోధక విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్నీ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. ఈ పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీ వర్గాల వారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది. ఈ పథకం ఆసరాగానే అనేక మంది పరిశోధనలు చేయగలిగారు. పరిశోధన మీద ఆసక్తి ఉన్న వారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావకాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసాగించ గలుగుతారు. ఆ అవకాశం లేకపోతే ఉన్నత విద్య ఆర్థిక స్తోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది.

మౌలానా ఆజాద్ పథకం రద్దు చేయక ముందు కూడా ఈ పథకం కింద విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యుజిసి) దరఖాస్తులు ఆహ్వానించడాన్ని మందగింపు చేసింది. ఈ పథకం కింద ఆఖరుసారి దరఖాస్తులు ఆహ్వానించింది 2018 లోనే. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారా అని 2020 మార్చిలో లోక్‌సభలో ప్రశ్న అడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాలశాఖమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దీని కోసం మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం అని చెప్పి దరఖాస్తులు ఆహ్వానించడం లేదన్న వాస్తవం చెప్పకుండా తప్పించుకున్నారు. మార్గ దర్శకాలంటే మౌలానా ఆజాద్ ఉపకార వేతనాల పథకాన్ని రద్దుచేయడమని ఇప్పుడు రుజువైంది. కచ్చితమైన ముస్లిం వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న మోడీ సర్కారు ఇప్పుడు ఆ వర్గంపై మరో రకంగా దెబ్బ తీసింది. ముస్లింల మీద దాడులకు తోడు ఇప్పుడు పరోక్షంగా కూడా దాడులకు దిగారు.

‘జాతి నిర్మాణం’, ‘జాతీయ భద్రత’ పేర పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ) లాంటి వాటి ద్వారా ఇది వరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాల వల్ల ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడిపోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరుగక తప్పదు. కేవలం 2.76 శాతం మంది ముస్లింలే ఉన్నత విద్య అభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయివారుగా మారిపోయిన ముస్లింలను మిగతా సమాజానికి మరింత దూరం చేసే కుట్ర జరగడం దురదృష్టకరం. ఇకనైనా మైనారిటీల స్థితిగతులులను అర్థం చేసుకొని పరిశోధన ఫెలోషిప్‌ను పునరుద్ధరించాలి.

జటావత్ హనము
851983 6308

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News