తెలంగాణలో మరో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో రాత్రి భోజనం అనంతరం తన రూమ్ కి వెళ్లే క్రమంలో మెట్లపై నుంచి జారిపడ్డ మరణించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ పట్టణంలోని జమాలియా కాలనీకి చేందిన 9వ తరగతి విద్యార్థిని సాధియా(14) తీవ్రంగా గాయపడడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సాదియా మృతి చెందినట్లు సమాచారం.
కాగా, రాష్ట్రంలో ఇటీవల కాలంలో గురుకుల స్కూల్స్ వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటికే ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అయినా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.