ప్రస్తుతం జరుగబోతున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల నమోదు కోసం చివరి వరకు ఇచ్చిన అవకాశంలో మొత్తం 3 లక్షల 80 వేల పైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో దాదాపు 50 నుండి 60 వేల వరకు మైనారిటీ ఓట్లు ఉన్నాయని ఓటరు లిస్టులు చెబుతున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికలలో వీరు కీలకం కాబోతున్నారని కొన్ని సర్వే లెక్కల ద్వారా తెలుస్తుంది. ఈ మధ్య మైనారిటీ వర్గ విద్యావంతుల టిం కరీంనగర్ ఎంఎల్‌సి నియోజకవర్గంలోకి వచ్చే అన్ని జిల్లాలలోని యువత, అధ్యాపకుల శాంపిల్ సర్వే, మైనారిటీ వర్గ పెద్దలు, విద్యార్థులు అభిప్రాయాల ద్వారా జరిపిన కొన్ని విశ్లేషనల్లో తేలిన విషయం వలన చివరికి మైనారిటీ ఓట్లు గెలుపోటములను తారుమారు చేయబోతున్నారు.
ఈ నియోజక వర్గ పరిధిలో మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 13 నూతన జిల్లాలున్నాయి. ఇందులో ముస్లిం ప్రాబల్యం ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, బోధన్, జగిత్యాల, కోరుట్ల లాంటి పట్టణాల్లోని యువత ప్రభావం చూపనుంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎంఎల్‌సి కోసం పోటీపడుతున్నది మొత్తం 56 మంది. అయితే ఇందులో నలుగురే చివరి వరకు పోటీలో ఉండవచ్చు. అయితే ముస్లిం వర్గం సెక్యులర్ పార్టీలకు, సెక్యులర్ వ్యక్తులకే మద్దతిస్తాయి. కాబట్టి ప్రతిసారి దాదాపు కాంగ్రెస్ పార్టీకు, బిఆర్‌ఎస్ పార్టీకే మద్దతుగా నిలిచాయి. ఈసారి వీరు ఏవరికి మద్దతిస్తారనేది సాధారణ జనాలకు అంతుపట్టడం లేదు. పోటీలో ఉన్న ముఖ్యనాయకులు సైతం వీరి నాడీపట్టలేకపోతున్నారు. కొందరు తమకే అనుకూలంగా ఉంటారని భావిస్తున్నప్పటికీ చివరికి వారి అంచనాలు తారు మారయ్యే సందర్భాలున్నాయి.
వాటిని ఒకసారి పరిశీలించినట్లయితే ఈసారి బిఆర్‌ఎస్ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించక పోవడంతో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటారని అనుకుంటే అది ఈసారికి మాత్రం అనుమానంగానే ఉంది. దీనికి కారణం కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం వర్గం నుండే స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉండి సాధ్యమైనంత వరకు ఓట్లకోసం ప్రయత్నం నడుస్తుంది. గెలవకున్నా సరే ఓట్లు మాత్రం తప్పకుండా చీలిపోతాయి. దీనితో పాటు బిఆర్‌ఎస్ పార్టీ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌కి కూడా మైనారిటీ ఓట్లు పడనున్నాయి. తాను చేసిన సేవా కార్యక్రమాల వలన కొందరు ప్రజలు, బిఆర్‌ఎస్ పార్టీలోని మైనారిటీ వర్గం ఈయనకు అనుకూలంగా ఉంది. ఇలా మైనారిటీ ఓట్లు చీలుతుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి కొంతమేరకు నష్టమే జరుగుతుంది. మరొక విషయమేమంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు చొరవ తీసుకొని మైనారిటీ నాయకులతో ఎన్నో సభలు నిర్వహిస్తున్నప్పటికీ అసలు గ్రాడ్యుయేట్ ఓటర్లు, విద్యావంతులు కాకుండా పార్టీ కార్యకర్తలతో సభలు నిర్వహిస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థికి ముందునుండి మైనారిటి వర్గ నాయకులతో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో అనుకున్నంత శాతం ఓట్లు రాకపోవచ్చని అంచనా! ఈ కారణాలతో 30 నుండి 40 వేల ఓట్ల ప్రభావంతో గెలుపోటమి తారుమారు కావచ్చు! ఆదే సందర్భంలో ఆల్ ఇండియా పార్టీ తరపున పోటిలో ఉన్న బిఆర్‌ఎస్ నాయకుడు రవీందర్ సింగ్‌కు మైనారిటీ ఓట్లు అధిక శాతం వచ్చినట్లైతే సింగ్ గెలిచే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. దీనికి తోడు రవీందర్ సింగ్ మరో వర్గం ఓట్ల కోసం మరికొంత కష్టపడాల్సి ఉంటది. ఇలా వీరిద్దరికి కాకుండా మైనారిటీ ఓట్లు స్వతంత్రంగా నిలబడ్డ ముస్లిం అభ్యర్థికి పడతాయని చాలా మంది నమ్ముతున్నప్పటికీ వాస్తవంగా తేలిన విషయమేమంటే ఈయనకి కూడా మొత్తం ఓట్లు పడవు.
గెలిచే అవకాశం లేదని, ఓటు వృథా చేయవద్దని కొందరు ముఖ్య మైనారిటీ నాయకుల హితబోధతో ముస్లిం అభ్యర్థికి మొత్తం ఓట్లు రాలేని పరిస్థితి నెలకొంది. ఓట్లు వేసేది విద్యావంతులు, పట్టభద్రులు కావున చాలా తెలివిగా ఆలోచించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి వైపే చివరకు మొగ్గు చూపుతారని తెలుస్తుంది. బిసి అభ్యర్థుల తరపున ముగ్గురు నలుగురు బలమైన అభ్యర్థులు పోటీలో ఉండడం వలన బిసి వర్గం ఓట్లు ఖచ్చితంగా ఒకే అభ్యర్థికి రావడం కష్టమే! ఇందులో ఒక అభ్యర్థి బహుజన సమాజ్ పార్టీ తరపున గట్టి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వర్గ అభ్యర్థులు మైనారిటీ ఓట్ల మీద ధ్యాస పెట్టలేకపోతున్నారు. ఇలా ప్రధాన పోటీదారులు ప్రణాళిక లేకుండ, ఓట్లను పొందలేక గెలిచే అవకాశం ఉన్నవారు కూడా ఓటమి చవిచూడవచ్చు! దాదాపు 50 వేల పైన అధిక సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్లు ఒకే అభ్యర్థికి వచ్చినట్లైతే వంద శాతం విజయాన్ని ముద్దాడవచ్చు. ఈ లెక్కను పసిగట్టలేని సదరు అభ్యర్థులు మైనారిటీ ఓట్లను రాబట్టడంలో ఇప్పటి వరకైతే సఫలం కాలేదనే చెప్పాలి.
అందరూ పైపైనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లేదా మాజీ మేయర్ సింగ్ గట్టి ప్రయత్నం చేస్తే అధిక శాతం మైనారిటీలు ఒకే వైపు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వీరెవరూ ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వీరి ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌కి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నూతనంగా రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు. కావున ఈ విషయంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మైనారిటీ శాఖ మంత్రి లేకపోవడం కూడా కొంతమేరకు కారణం కావచ్చు. మరొక విచిత్రమేమంటే చాలా చోట్ల సభలలో పార్టీలకు సంబంధించిన మైనారిటీ కార్యకర్తలు తరలివస్తుంటే ఎవరికి వారు పక్కా గెలుస్తామని ధీమాలో ఉన్నారు. కాని నిజమైన పట్టభద్రులు ఆ సభలలో లేరనేది గుర్తించలేకపోతున్నారు. మైనారిటీ వర్గంలోని విద్యావంతులతో, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ముఖ్య నాయకులను ఒప్పించే ప్రయత్నం చేయగలిగితే ప్రధాన పోటీదారులకు ఫలితం ఉంటుంది.
సయ్యద్ అలీ
9949303079