నగరంలో ఉన్న మైనర్లు మత్తులో తూగుతున్నారు, విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సిగరేట్లు, మద్యం లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. మైనర్లకు మద్యం, సిగరేట్లు విక్రయించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కూడా డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఉన్న వ్యాపారులు వాటిని పట్టించుకోవడంలేదు. మైనర్లకు మద్యం, సిగరేట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మైనర్లకు సిగరేట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడలో ఇద్దరు కిరాణా వ్యాపారులు మైనర్లకు సిగరేట్లను విక్రయిస్తున్నారు. ఈ తతంగం గతకొంత కాలం నుంచి కొనసాగుతోంది. దీనిని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇవేకాకుండా చాలామంది నగరంలో మైనర్లకు ఈ సిగరేట్లను కూడా విక్రయిస్తున్నారు. ఇందులో వివిధ రకాల ఫ్లేవర్లు ఉండడంతో వాటిని మైనర్లు సులభంగా కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈ సిగరేట్లలో మత్తుకు సంబంధించిన ఫ్లేవర్లు ఉంటున్నాయి. వాటిని చాలామంది యథేచ్ఛగా విక్రయిస్తున్నారు, వ్యాపారులు ఢిల్లీ నుంచి ఈ సిగరేట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి మైనర్లకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. సిగరేట్లు ఏవైనా తాగే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లోని వైన్స్ షాపుల్లో కూడా మైనర్లకు మద్యం విక్రయిస్తున్నారు. మైనర్లు మద్యానికి దూరంగా ఉండాలని వారికి మద్యం విక్రయం నిషేధించారు.
దానికి సంబంధించిన బ్యానర్‌ను ప్రతి వైన్స్ షాపు వద్ద ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. వైన్స్ వద్ద బ్యానర్లను ఏర్పాటు చేసినా కూడా మద్యం వాపారులు వారికి విక్రయిస్తున్నారు. దీంతో మైనర్లు మద్యం తాగి ఊగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మైనర్లు వైట్‌నర్‌ను కూడా మత్తు కోసం వాడుతున్నారు. దీనిని బుక్‌స్టాల్స్‌లో సులభంగా విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వీటిపై కూడా పోలీసులు నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.