Wednesday, January 22, 2025

పాపికొండల అడవిలో అద్భుతం…

- Advertisement -
- Advertisement -

నల్లమద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార
బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్
జలధారా చెట్లను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ విషయం విన్నారా… ఎక్కడైనా సాధారణంగా భూమిలో బోరు వేస్తే నీళ్లు ఉబికి వస్తాయి. కానీ చెట్టును నరికితే నీళ్లు ఉబికి రావడాన్ని ఎప్పుడైనా చూశారా. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. ఒక చెట్టు మొదలు భాగం నరుకుతుండగా, ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది.

పాపికొండల నేషనల్ ఫారెస్ట్ పరిధిలోని (నేషనల్ ఫారెస్ట్ రేంజ్ ) కింటుకూరు ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారుల పరిశీలనలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అక్కడ నల్ల మద్ది చెట్టును కొంత మేర కట్ చేయగా ఒక్క సారిగా నీళ్ల ధార రావడం కనిపించింది. ఏదో చుక్కలు, చుక్కలుగా రావడం కాదు.. ఒక స్థాయిలోనే నీటి ధార రావడం విశేషం. దీనిని గమనించిన అటవీశాఖ అధికారులు, వెను వెంటనే చెట్టు బెరుడును కొంత మేర నరకగా, మొదలు భాగం నుంచి నీళ్లు భారీగా ఉబికి వచ్చాయి.

అలా వచ్చిన జలధార చూసిన ఫారెస్ట్ అధికారులు అవాక్కయ్యారు. ఆ చెట్టు నుంచి దాదాపు ఇరవై లీటర్ల వరకు నీరు వస్తుందని చెబుతున్నారు. చెట్టు నుంచి వచ్చిన నీళ్లను అటవీ శాఖ అధికారులు తాగారు. ఈ చెట్టును జలధార వృక్షంగా వారు చెబుతున్నారు. కాగా ఈ జలధారకు సంబంధించి ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏపిలోని అల్లూరి జిల్లా రంపచోడవరం – కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్లు వేలాదిగా ఉన్నాయి.

కొన్నింటిలోనే నీటిని నిలువ చేసుకునే వ్యవస్థ ఉంది. నల్ల మద్ది చెట్టు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుంది. గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో విరివిగా ఈ నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఎతా వాతా ఇలాంటి చెట్లు అరుదుగానే ఉంటాయి అని అధికారులు చెబుతుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News