Monday, February 10, 2025

అమ్మబోతే అడ్డికి పావుశేరు

- Advertisement -
- Advertisement -

అన్నదాతను ఏడిపిస్తున్న ఎర్రబంగారం
మార్కెట్‌లో క్వింటాల్‌కు 12 నుంచి
16వేలే పలుకుతున్న మిర్చి ధర
గత ఏడాది ఇదే సమయంలో
రూ.23 వేల వరకు అమ్ముకున్న రైతన్నలు
విదేశాలకు ఎగుమతులు తగ్గడమే తాజా
పరిస్థితికి కారణం అంటున్న వ్యాపారులు

మన తెలంగాణ/హైదరాబాద్: మిర్చి పంట రైతులను నష్టా ల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వారు వాపోతున్నారు. చెమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. గిట్టుబాటు ధరకు పంట కొనాలని కోరుకుంటున్నారు. మిర్చి మార్కెట్‌లో ధరల దగా మరోసారి అన్నదాతను నిండా ముంచుతోంది. వ్యాపారుల కుమ్మక్కుతో సాగుదారులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గి ట్టుబాటు ధర దక్కుతుందని కొండంత ఆశతో అంగడికి వ చ్చిన కర్షకులకు కొనుగోళ్ల మాయాజాలంతో నష్టాలు మూ టగట్టుకుని తిరుగు పయనమవుతున్నారు.

క్వింటాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తక్కువకు కొనుగోలు చేస్తుండటంతో రైతన్నలు వాపోతున్నారు. పంటను పండించే రైతుకు కూలీల రేట్లు విపరీతంగా పెరగడం, పంటను పండించడానికి కావాల్సిన ఎరువులు రేట్లు ఆకాశంలో ఉండటంతో పంటను పండించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పండిన పంటను మార్కెట్ యార్డులో అమ్ముకోవడానికి వస్తే ఇక్కడా కూడా కాటా రేట్లు, ముఠా కూలి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు వాహనాల్లో మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోం ది. ఇలా చూసుకుంటూ పోతే పక్క రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ సైతం మిర్చి పంటను పండించడానికి తహతహలాడుతున్నారు. ఇలాంటి సమయంలో పండిన పంటను సరైన కలలో అమ్ముకోకపోతే రైతు తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు పండిన పంటను శీతల గిడ్డంగుల్లో దాచుకోవడానికి పోతే అక్కడా కూడా అద్దెల పేరుతో మోతమోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది ఇదే నెలలో గరిష్ఠంగా రూ.23 వేల ధర పలికిన ఎండు మిర్చి ప్రస్తుతం రూ.16 వేలు కూడా దాటడం లేదని రైతులు చెబుతున్నారు. క్వింటాల్ మిర్చికి రూ.7 వేల వరకు నష్టాలతో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. గత ఏడాది తక్కువ ధరలు వచ్చాయని కోటి బస్తాలకు పైగా మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేశారు. ఇప్పుడు గతం కంటే ధరలు పతనం కావటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గటంతోనే ధరలు పతనమవుతున్నాయ నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020- నుంచి 2022 మధ్యకాలం లో మిర్చికి మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు పత్తిని కాదని మరీ మిర్చి వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్నారు. అయితే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మిర్చిని పండించటం ఒక ఎత్తయితే ఆరబోసి, ఎండబెట్టడం మరో ఎత్తు. ఇంతా చేసి మార్కెట్‌కు తీసుకెళ్తే ఆశించిన ధర దక్కడం లేదు. ఆశించిన స్థాయిలో ధరలు లభించకపోవటంతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఈ ఏడాది కూడా ఎర్ర బంగారం ధరలు పడిపోతుండటం గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది.

రైతుకు దక్కని మద్ధతు ధర

కొత్త మిర్చి ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తుండగా రైతులు ఎక్కువ సాగు చేసే తేజ రకం మిర్చికి రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు, వండర్ హాట్ మిర్చికి రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ధరలున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే తేజ రకం మిర్చికి క్వింటాలుకు రూ.7 వేల వరకు, వండర్‌హాట్ రకానికి రూ.14 వేల వరకు ధరలు తగ్గినట్టుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కోల్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న ఏసీ మిర్చికి అదే స్థాయిలో ధరలు తగ్గాయి. ఒక్క వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లోనే సుమారు 25 లక్షల బస్తాలను నిల్వ చేయగా ఖమ్మంతో పాటు మిగతా వ్యవసాయ మార్కెట్లలో 75 లక్షలకు పైగా బస్తాలను భద్రపరిచారు. గతేడాది డిసెంబరులో తేజ రకం ఏసీ మిర్చికి గరిష్ఠంగా రూ.24,250 ధర ఉండగా, వండర్ హాట్ రకానికి రూ.27,300 వరకు పలికింది. అయితే ప్రస్తుతం ఏసీ తేజ రకానికి రూ.15,500 వరకు, వండర్ హాట్ రూ.13 వేల వరకే ధరలున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పతనంతో పాటు కోల్‌స్టోరేజీల్లో నిల్వకు బస్తాకు రూ.150 నుంచి రూ.300 వరకు చెల్లించటం అదనపు భారంగా మారిందని వాపోతున్నారు.

ఎగుమతులు లేక రైతన్న డీలా

మిర్చి ధరల పతనానికి విదేశాలకు ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం మిర్చికి మంచి ధరలు రావటంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని అయితే అదే స్థాయిలో ఎగుమతులు లేవంటున్నారు. మిర్చి పంటలో 70 శాతం చైనా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎగుమతులపై ప్రభావం పడిందని, అలాగే చైనాకు కూడా భారీగా ఎగుమతులు తగ్గటంతో ధరల పతనానికి దారి తీసిందని అంటున్నారు. రోజురోజుకు ధరలు పడిపోతుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ వారంలో క్వింటా మిర్చి గరిష్ఠ ధర రూ.14,800 పలకగా బుధవారం రూ.14,500, గురువారం రూ.14, 000కు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సీజన్‌లో మిర్చి గరిష్ఠ ధర రూ.23 వేలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏసీ తేజ మిరప క్వింటా గరిష్ఠ ధర రూ.12 వేలకు పడిపోయిదని, తాలు మిరపను గరిష్ఠంగా క్వింటా రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది తెగుళ్లు అధికంగా ఉండటంతో పెట్టుబడి అధికమైంది. ఇదే సమయంలో ధరలు తగ్గుతుండటంతో పెట్టుబడి కూడా రావడం గగనమైందని మిర్చి పండించిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News